1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Telangana : Husband Killed wife for bike in Sangareddy dist

అత్తింటివారు బైకు కొనివ్వలేదని భార్యను గదిలో ఉరేసిన భర్త...

anjaiah couple
తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. అత్తింటి వారు ద్విచక్రవాహనాన్ని కొనివ్వలేదని కట్టుకున్న భార్యను ఓ కసాయి భర్త ఉరేసి హత్య చేశాడు. ఆ తర్వాత భర్త కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మారేపల్లి శివారులోని మామిడితోటలో చోటుచేసుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కొండాపూర్ మండలం మారేపల్లికి చెందిన దాసరి అంజయ్య (25) అనే వ్యక్తికి 11 నెలల కిందట నారాయణఖేడ్ మండలం సంజీవ్రావుపేటకు చెందిన యాదమ్మ (20)తో వివాహం జరిగింది. భార్య, తల్లి, సోదరుడితో కలిసి మారేపల్లి శివారులోని ఓ మామిడితోటను కౌలుకు తీసుకున్నారు. అక్కడే నివాసం ఉంటూ మామిడి పండ్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. మద్యానికి బానిసైన అంజయ్య.. అత్తింటివారు ద్విచక్ర వాహనం కొనివ్వాలని తరచూ భార్యతో గొడవపడేవాడు. 
 
ఈ క్రమంలో శుక్రవారం ఉదయం అంజయ్య తల్లి మామిడి పండ్లు విక్రయించేందుకు సదాశివపేటకు వెళ్లారు. ఇంట్లో భార్యాభర్తలు మాత్రమే ఉన్నారు. ద్విచక్రవాహనం విషయంలో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆగ్రహించిన అంజయ్య భార్య యాదమ్మను గదిలో చున్నీతో ఉరేసి హత్య చేశాడు. 
 
పోలీసు కేసు అవుతుందని ఆందోళన చెందిన అంజయ్య.. ఘటనాస్థలికి కొద్ది దూరంలో మామిడిచెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ సత్తయ్యగౌడ్ ఘటనా స్థలిని పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు. యాదమ్మ తండ్రి సాయిలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌పై నాన్ బెయిలబుల్ కేసు : అరెస్టు చేసిన పోలీసులు