మంగళవారం, 17 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 ఫిబ్రవరి 2026 (22:32 IST)

నన్ను పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తావా? మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి

fire
తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళపై ఓ వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గూడూరు మండలానికి చెందిన ఓ మహిళ తన భర్తతో మనస్పర్థల కారణంగా వేరుగా ఉంటుంది. ఇద్దరు పిల్లలను వసతిగృహంలో చదివిస్తూ స్థానికంగా కూరగాయల దుకాణం నడిపిస్తూ జీవిస్తోంది. 
 
ఈ క్రమంలో అంజయ్య అనే వ్యక్తి.. సదురు మహిళతో సాన్నిహిత్యం పెంచుకుని వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత తనను వివాహం చేసుకోవాలంటూ ఆమెను వేధించసాగాడు. అయితే, అంజయ్య మాటలను ఖండిస్తూ, తనకు ఇది వరకే వివాహమైందని.. భర్త, పిల్లలు ఉన్నారని చెప్పి హైదరాబాద్‌కు మకాం మార్చింది.
 
ఇటీవల ఆ మహిళ మహబూబాబాద్‌లో ఉంటున్న తన తల్లి ఇంటికి వచ్చి ఉంటుంది. ఈ సమాచారం తెలుసుకున్న అంజయ్య అక్కడికి వచ్చి తనను నిరాకరించిందన్న కోపంతో ఆమెపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఈ క్రమంలో అంజయ్యకు మంటలు అంటుకున్నాయి. ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు మొదట పట్టణ ప్రభుత్వ ఆస్పత్రికి, అనంతరం వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. మహిళ తల్లి ఫిర్యాదు మేరకు అంజయ్యపై కేసు నమోదు చేసినట్లు సీఐ మహేందర్‌ రెడ్డి తెలిపారు.