అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నారనీ అత్త, భర్తపై విష ప్రయోగం..
తెలంగాణ రాష్ట్రంలో ఓ వివాహిత ఘాతుకానికి పాల్పడింది. తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నారన్న కసితో అత్తతో పాటు.. కట్టుకున్న భర్తపై విష ప్రయోగానికి పాల్పడింది. ఈ దారుణం రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం, ముదక్‌పల్లిలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారని గ్రామానికి చెందిన పి.సోని(33) తన భర్త, అత్తను హతమార్చాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో శనివారం ఇంట్లో వండిన కూరలో గడ్డి మందు కలిపింది. మధ్యాహ్నం భోజనం చేసిన అత్త భూదేవ్వ తీవ్ర వాంతులు, విరేచనాలు చేసుకున్నారు.
తర్వాత భర్త భూమన్న అలియాస్ భూమయ్య అదే కూర తినే సమయంలో గడ్డి మందు వాసన రావడంతో అనుమానం వచ్చి తినడం ఆపేశారు. అప్పటికే కొంత తినడంతో ఆయనకు తల తిరగడంతో విషయాన్ని స్థానికులకు తెలిపారు. వారు వెంటనే భూదేవ్వ, భూమన్నను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వారిద్దరికి సకాలంలో వైద్యం అందడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వారి ఫిర్యాదు మేరకు నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారించగా.. నేరాన్ని అంగీకరించడంతో కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచి ఆదివారం రాత్రి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. భూమన్న, సోని దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
