పీడ విరగడైంది, తాగుబోతు భర్త వేధింపులు తట్టుకోలేక చంపేసిన భార్య
మద్యానికి బానిసైన వాడితో కాపురం చేయడం ఎంత బాధగా వుంటుందో, అతడు పెట్టే చిత్రహింసలు భరిస్తూ ఎంతటి మనోవేదనకు గురవుతుంటారో తాగుబోతు భర్తలపై భార్యలు చేసే ఫిర్యాదులను బట్టి తెలుస్తుంది. సమాజంలో తాగుబోతు భర్త వల్ల తమకు గౌరవం వుండదనీ, ప్రతి ఒక్కరూ చిన్నచూపు చూస్తారంటూ బాధిత మహిళలు ఆవేదన చెందుతుంటారు. ఈ క్రమంలో కొందరు తీవ్ర ఆగ్రహానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటుంటారు. తాగుబోతు భర్తతో వేగలేక అతడి అడ్డు తొలగించుకుంటారు. ఇలాంటి ఘటనే మార్కాపురం గిద్దలూరు మండలం దంతరపల్లెలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 53 ఏళ్ల హరి అనే వ్యక్తి మద్యం సేవించి తరచూ భార్యతో గొడవపడేవాడు. సోమవారం రాత్రి కూడా పూటుగా మద్యం సేవించి భార్యతో మళ్లీ ఘర్షణ పడ్డాడు. సహనం నశించిన అతడి భార్య తన కుమార్తెల సాయంతో భర్త హరికి ఎదురుతిరిగింది. ఈ క్రమంలో ఇద్దరూ పరస్పరం దాడి చేసుకున్నారు. దీనితో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె బలమైన వస్తువుతో అతడి తల మీద కొట్టింది. దాంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఈరోజుతో పీడ విరగడైందంటూ ఆమె ఆవేశంతో పాటు కన్నీటిపర్యంతమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
