అప్పు అడిగితే ఇవ్వలేదన్న అక్కసుతో ఒంటిరి మహిళను అంతమొందించారు...
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నపుడు అప్పు అడిగితే డబ్బులు ఇవ్వలేదన్న అక్కసుతో ఒంటరిగా ఉన్న ఓ మహిళను తల్లీ కుమారుడు కలిసి హత్య చేశారు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు అడిగితే ఇవ్వలేదన్న అక్కసు.. మరోవైపు తనతో సన్నిహితంగా ఉన్న వ్యక్తి దూరమవడానికి కారణమనే కోపంతో ఓ మహిళ తన కుమారుడితో కలిసి ఒంటరి మహిళను అంతమొందించిన దారుణమిది.
గన్నవరం దావాజీగూడెం రోడ్డులోని జీఆర్‌కే ప్యారడైజ్ భవనంలో కాజ రజితకుమారి (55) ఒంటరి మహిళ. ఆమె భర్త చనిపోగా ఇద్దరు కుమార్తెలు అమెరికాలో స్థిరపడ్డారు. దీంతో రజిత కుమారి ఒంటరిగా ఉంటూ శ్రీనగర్ కాలనీలో పిండి మర నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నారు.
ఇదే కాలనీలో నివాసం ఉండే పోలవరపు సుష్మ, ఆమె కుమారుడు పోలవరపు అజయ్ కొంతకాలంగా రజిత వద్ద అప్పులు తీసుకొని చిట్టీలు కడుతూ సన్నిహితంగా ఉండేవారు. సుష్మ, ఆమె కుమారుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని అప్పుగా డబ్బులు కావాలని కొంతకాలంగా రజితను అడగ్గా ఆమె ఇస్తానని పదే పదే మాటదాటేస్తూ వచ్చింది.
పైగా, గన్నవరానికి చెందిన ఓ న్యాయవాదితో సుష్మకు వివాహేతర సంబంధం ఉండగా కొంతకాలం రజిత కారణంగా అతడు సుష్మకు దూరంగా ఉంటున్నాడనే అపోహతో ఆమె అడ్డు తొలగించుకునేందుకు తల్లీ, కుమారుడు పన్నాగం పన్నారు.
ఈ నేపథ్యంలోనే ఈ నెల 24న రాత్రి 11 గంటల సమయంలో రజిత తన కుమార్తెతో ఫోనులో మాట్లాడుతుండగా ఎవరో కాలింగ్ బెల్ కొట్టారని ఫోన్ కట్ చేశారు. అనంతరం తిరిగి ఫోన్ చేస్తే కలవలేదు. ఉదయాన్నే పని మనిషి వచ్చి చూస్తే బెడ్ రూమ్‌లో రజిత మృతి చెంది కనిపించింది.
పోలీసులకు సమాచారం ఇవ్వగా కుమార్తె, బంధువుల సమాచారంతో మృతురాలి ఒంటిపైన, ఇంట్లోని బంగారం, నగదు కనిపించలేదని గుర్తించారు. అపార్ట్‌మెంట్ సీసీ కెమెరాలు పరిశీలిస్తే సుష్మ, ఆమె కుమారుడు అజయ్ ఫ్లాట్‌లోకి వచ్చినట్లు గుర్తించారు. నిందితులను విచారించగా ఘాతుకానికి పాల్పడినట్టు నేరాన్ని అంగీకరించారు.
నిందితుల నుంచి రూ.56లక్షల సొత్తు.. నేరానికి వినియోగించిన ఓ స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పోలవరపు అజయ్‌పై ఉయ్యూరు టౌన్ ఠాణాలో సస్పెక్ట్ షీట్ ఉంది. కేసు వివరాలను ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు శుక్రవారం తన కార్యాలయంలో వెల్లడించారు. తక్కువ సమయంలో కేసు ఛేదించిన సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు.
