1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Woman, paramour, two others held for staging husband’s murder as accident in Mancherial

అక్రమ సంబంధం.. రూ.2 కోట్ల బీమా సొమ్ము కోసం భర్తను హత్య చేయించిన భార్య

murder
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాలలో దారుణం జరిగింది. పరాయి పురుషుడుతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ మహిళ... భర్తపై చేయించుకున్న రూ.2 కోట్ల బీమా సొమ్ము కోసం కట్టుకున్న భర్తను హత్య చేయించింది. ఈ కేసులో కిరాయి హంతకులకు భార్యే సుపారీ ఇచ్చి ఈ దారుణానికి పాల్పడింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలం గుడిపేటకు చెందిన సాయిని కుమార్‌ (45) తన ద్విచక్రవాహనంపై ఈ నెల 22న మంచిర్యాల వైపు వెళ్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని స్థానికులు 108లో కరీంనగర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ప్రమాదంపై అనుమానం ఉండటంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. 
 
ఈ విచారణలో సాయిని కుమార్‌ భార్య సాయిని భారతికి గుడిపేటకు చెందిన లగిశెట్టి సురేందర్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్టు గుర్తించారు. తమ మధ్య ఉన్న బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని అతడిని హత్య చేయాలని ఇద్దరు భావించారు. 2025 జనవరి నుంచే భర్త పేరిట ఎల్‌ఐసీతో పాటు పలు బీమా సంస్థలలో ప్రీమియంలు చెల్లిస్తూ వస్తోంది. కుమార్‌ రోడ్డు ప్రమాదంలో చనిపోతే సుమారు రూ.2 కోట్ల వరకు వస్తుందని వారిద్దరూ భావించారు. 
 
సాయిని కుమార్‌ గుడిపేటకు చెందిన రామ్‌ మల్లేశ్‌ వద్ద రూ.60 వేలు అప్పుగా తీసుకొని చెల్లించకపోవడంతో ఇంటికి వెళ్లి గొడవ చేసేవాడు. ఈ క్రమంలో మల్లేశ్‌కు కుమార్‌ భార్య భారతితో పరిచయం ఏర్పడింది. తన భర్తను హత్య చేస్తే రూ.10 లక్షల సుపారీ ఇస్తానని గత నెలలో రూ.2 లక్షలు మల్లేశ్‌కు భారతి, సురేందర్‌లు చెల్లించారు. 
 
తాను ఒక్కడే ఈ హత్య చేయలేనని మంచిర్యాలలోని ఎల్‌ఐసీ కాలనీకి చెందిన శ్రీరామ్‌తో జతకూడాడు. పథకం ప్రకారం ఈ నెల 22న ముల్కల్ల గ్రామశివారులో రామ్‌ మల్లేశ్, శ్రీరామ్‌లు కుమార్‌కు అతిగా మద్యం తాగించి ఇనుప సుత్తితో తలపై బలంగా కొట్టి గాయపరిచారు. అనంతరం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు కుమార్‌తో పాటు అతడి ద్విచక్రవాహనాన్ని రోడ్డు పక్కన పడేసి పరారయ్యారు. 
 
అయితే తమ కుమారుడి మృతిపై రామ్‌ మల్లేశ్‌పై అనుమానం ఉన్నట్లు కుమార్‌ తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. భారతి వ్యవహారశైలి, సురేందర్‌తో ఆమెకు ఉన్న వివాహేతర సంబంధం పోలీసుల అనుమానాలను బలపరచడంతో లోతుగా విచారణ జరిపారు. ఇందులో రోడ్డు ప్రమాదాన్ని హత్యగా ఛేదించారు. నిందితుల నుంచి ప్రీమియంకు సంబంధించిన పత్రాలతో పాటు రూ.25 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులైన భారతి, సురేందర్, శ్రీరామ్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని డీసీపీ పేర్కొన్నారు. రామ్‌ మల్లేశ్‌ పరారీలో ఉన్నాడని తెలిపారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
చంద్రునిపై అన్వేషణ మిషన్లకు మద్దతుగా రోబోటిక్ ల్యాండర్లు, రోవర్లు, డ్రోన్‌లు