గురువారం, 19 ఫిబ్రవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 జనవరి 2026 (10:13 IST)

బెంగాల్‌లో విషాదం : డిజిటల్ అరెస్ట్ భయంతో యువకుడు ఆత్మహత్య

deadbody
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో దారుణం జరిగింది. డిజిటల్ అరెస్టు భయంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. గుర్తు తెలియని వ్యక్తులు పంపిన ఓ నోటీసుతో తీవ్ర ఆందోళనకు గురైన ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన బెంగాల్ రాష్ట్రంలోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని అశోక్ నగర్‌లో జరిగింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. రాజ్ బేరియా గ్రామానికి చెందిన మోనిరుల్ గోల్దార్ (37) తేనె వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం ఉదయం తన ఇంటికి సమీపంలోని మామిడి చెట్టుకు ఉరి వేసుకుని విగతజీవిగా కనిపించాడు. అతడి మృతికి 'డిజిటల్ అరెస్ట్' భయమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 
 
ఈ నెల 8వ తేదీన మోనిరుల్ ఇంటికి పోస్ట్ ద్వారా ఒక నోటీసు అందింది. మహారాష్ట్రలోని పుణె సైబర్ పోలీసులు పంపినట్లుగా ఉన్న ఆ నోటీసులో అతడి పేరు మీద ఉన్న సిమ్ కార్డును నేర కార్యకలాపాలకు ఉపయోగించారని, ఏడు రోజుల్లోగా సంప్రదించాలని హెచ్చరించారు.
 
ఈ నోటీసు అందుకున్నప్పటి నుంచి మోనిరుల్ తీవ్ర భయాందోళనలకు గురయ్యాడని స్థానికులు చెప్పారు. తేనె సేకరణ కోసం బయటకు వెళ్తున్నానని చెప్పి బుధవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిన మోనిరుల్, తెల్లవారేసరికి శవమై కనిపించడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.