"లేహ్యం" కల్కి భగవాన్... "సెక్స్" నిత్యానంద..!!

వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT|
WD
ఆధ్యాత్మికత ముసుగులో అనేక వికృత కార్యాలు గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నాయి. ఇవి కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా.. ప్రతి చోటా వెలుగు చూస్తున్నాయి. దీంతో భక్తుని గుండే గుభేల్‌మంటోంది. దేశంలో ఎలక్ట్రానిక్ మీడియా పోటీతత్వం పుణ్యమాని.. స్టింగ్ ఆపరేషన్లు జోరుగా సాగుతున్నాయి.

దీంతో రాష్ట్ర "గవర్నర్" మొదలుకుని "దొంగబాబా"లు సాగిస్తున్న రాసలీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ సంచలనం సృష్టిస్తున్నాయి. మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక గురువుల వద్ద ప్రదక్షిణలు చేసిన సామాన్య, అమాయక భక్తజనం వీరిని చూసి దిగ్భ్రాంతికి లోనవుతోంది. దొంగబాబాల పుణ్యమాని.. నిజమైన బాబాల వద్దకు వెళ్లే భక్తులు కూడా ఇపుడు ఒకటికి పదిసార్లు ఆలోచన చేస్తున్నారు.

నిన్నటికి నిన్న మన రాష్ట్రంలోని సుప్రసిద్ధ కల్కి భగవాన్ (వరదయ్య పాళెం).. లేహ్యం ముసుగులో యువకులకు మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నట్టు ఒక న్యూస్ ఛానల్ బయటపెట్టింది. ఇదే విషయాన్ని విజయవాడకు చెందిన ఆశ్రమ మాజీ సేవకుడు నిర్ధారించడమే కాకుండా, ఆశ్రమంలో కొన్ని హత్యలు సైతం జరిగాయని చెప్పడం ఆందోళన కలిగించే విషయం.

ఈ సంఘటన నుంచి భక్తజనం తేరుకోకముందే.. తమిళనాడు రాష్ట్రంలో "నిత్యానంద" స్వామీజీగా భక్తులతో ప్రత్యేక సేవలు అందుకుంటూ వచ్చిన స్వామి.. ఒక ప్రముఖ సినీ నటితో రతిక్రియలో పాల్గొన్నట్లు ఉన్న వీడియోను ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ బయటపెట్టింది. ఈ స్వామీజీకి ఒక్క తమిళనాడులోనే కాక 33 ప్రపంచ దేశాల్లో వంద ఆశ్రమాలు ఉన్నాయి. ఇలా.. ప్రతిరోజూ ఆ నటితో "రసమయ" జీవితాన్ని అనుభవిస్తున్న బండారాన్ని తెలుసుకున్న స్థానిక భక్తులు ఆగ్రహోద్రుక్తులయ్యారు. ఆశ్రమంపై దాడి చేశారు.

అంతేకాదు ఈ సెక్స్ బాబాకు పలువురు కోలీవుడ్ తారలు, హీరోలుతో పాటు.. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలతో సైతం సత్సంబంధాలు ఉన్నట్టు తమిళ మీడియాలో పలు రకాల కథనాలు వస్తున్నాయి. దీంతో పూర్తి వివరాల కోసం పోలీసులు కూపీ లాగుతున్నారు.

దక్షిణాదిలో బాబాల పరిస్థితి ఇలా ఉంటే... ఉత్తరాదిన కూడా బాబాల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందనుకుంటే పొరపాటే. శివ మురత్ ద్వివేదీ (39) అలియాస్ ఇచ్ఛాదరి సంత్ స్వామి భీమానంద్‌ జీ మహరాజ్ చిత్రకూట్ అనే దొంగబాబా దక్షిణ ఢిల్లీ సమీపంలోని ఖనాపూర్‌ వద్ద ఆశ్రమాన్ని నెలకొల్పాడు. తనకు తాను గాడ్‌మెన్‌గా ప్రచారం చేసుకున్నాడు.

ఆశ్రమం ముసుగులో అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తూ వచ్చిన దొంగబాబా పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిపోయాడు. ఈ బాబాను పట్టుకునేందుకు ఢిల్లీ పోలుసులు పది సంవత్సరాల పాటు నిఘా వేయాల్సి వచ్చింది. దీంతో దశాబ్దం ముప్పతిప్పలు పెట్టిన గాడ్‌మెన్‌పై మోకా చట్టాన్ని ప్రయోగించాలని ఢిల్లీ పోలీసులు నిర్ణయించారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.... ఉత్తరాది పోలీసులు సెక్స్ బాబాల ఆటకట్టించేదుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. కానీ కళ్లెదుట రుజువులన్నీ కనబడుతున్నా దక్షిణాది సెక్స్ బాబాలను అడ్డుకుంటున్నవారే లేరు. ఎన్ని వీడియోలు వచ్చినా... ఎన్ని అకృత్యాలకు పాల్పడినా... అన్నింటినీ దొడ్డిదోవన మాఫీ చేయించుకుని హ్యాపీగా తమ కార్యకలాపాలను సాగించుకుంటున్నారు.

వీటికి కారణం.. ఈ దొంగ బాబాలతో రాజకీయనేతలకు మంచి సంబంధాలు ఉండటమే కాకుండా, ఠంచనుగా తమకు రావాల్సింది వచ్చి చేరుతుండటమే. దీంతో పోలీసులు కూడా చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా, తాము దర్శనానికి వెళ్లినప్పుడు.. రసమయ జీవితాన్ని తమకు కూడా బాబాలు రుచి చూపిస్తుండటంతో వారిని మరింత ఉత్తేజపరుస్తోంది. ఫలితంగా.. దక్షిణాదిలోని బాబాలు యధేచ్చగా తమ "ఆ"(ధ్యాత్మిక) కార్యకలాపాలను సాగిస్తూ, అమాయక భక్తులతో ఆడుకుంటున్నారు.


దీనిపై మరింత చదవండి :