శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: శనివారం, 5 డిశెంబరు 2015 (14:07 IST)

చెన్నై నటులు... కొందరు ముష్టి వేశారు... మరికొందరు దానకర్ణులుగా నిలిచారు...

చెన్నై వరదలు దక్షిణ చెన్నై నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ పలు కాలనీలు జల దిగ్బంధంలో ఇరుక్కుపోయి ఉన్నాయి. వారికి గుక్కెడు నీళ్లు దొరకడం లేదు. తినేందుకు తిండి కరవైంది. కంటినిండా నిద్రలేదు. కరెంటు లేదు. వరదతో పాటు పాములు, తేళ్లు ఇంటిలోకి దూరి బెంబేలెత్తిస్తున్నాయి. మామూలు స్థితికి వచ్చేందుకు ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితి. వరద నష్టం వేల కోట్లలో ఉంది.
 
సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న చెన్నై నగరవాసులను ఆయా సేవా సంస్థలు తమవంతు సాయాన్ని అందిస్తున్నాయి. ఐతే చెన్నై వరద బాధితులను ఆదుకోవడంలో జయ సర్కారు తీవ్రంగా విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు, నాయకులు పత్తా లేకుండా పోయారని ప్రజలు విమర్శిస్తున్నారు. 
 
కష్టాల్లో ఉన్నప్పుడు సినీ ఇండస్ట్రీ తమవంతు సాయం చేయడం మామూలే. ఈ భారీ వరదలకు కుదేలైన చెన్నై నగరవాసిని ఆదుకునేందుకు కొందరు స్టార్స్ కొద్ది మొత్తాన్ని ప్రకటిస్తే యువ నటుడు విజయ్ ఏకంగా రూ. 5 కోట్లు, దర్శక నటుడు రాఘవ లారెన్స్ రూ. 1 కోటి ప్రకటించి దానకర్ణులుగా నిలిచారు. ముఖ్యంగా తలైవా అని తమిళ ప్రజలు పిలుచుకునే రజినీకాంత్ ప్రకటించిన రూ. 10 లక్షల సాయంపై దర్శకుడు వర్మ సెటైర్లు వేశారు. ముష్టి వేయవద్దంటూ ధ్వజమెత్తారు. 
 
వర్మ కామెంట్ల మహిమో ఏమోగానీ నటుడు విజయ్ ఏకంగా రూ. 5 కోట్లు ప్రకటించి తన పెద్దమనసును చాటుకున్నారు. అలాగే దర్శక నటుడు రాఘవ లారెన్స్ రూ. 1 కోటి ప్రకటించి చెన్నై వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. నటులు సూర్య, కార్తీ కలిసి రూ. 25 లక్షలు, విశాల్ రూ. 10 లక్షలు ప్రకటించారు. ఇంకా కమల్ హాసన్ మాత్రం పరోక్షంగా ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇంట్లో సురక్షితంగా కూర్చుని వరద బాధితులు పడే కష్టాలను చూసేందుకు సిగ్గుగా ఉందని సెటైర్లు వేశారు. తను చేయాల్సింది చేస్తానని వెల్లడించారు. ముఖ్యమంత్రి సహాయనిధికి సాయాన్ని ప్రకటిస్తారా లేదా అనేది సస్పెన్సుగా మారింది. 
 
ఇక తెలుగు ఇండస్ట్రీ నుంచి చెన్నై వరద బాధితులకు తమవంతు విరాళాలను ప్రకటించిన నటీనటుల్లో... జూనియర్ ఎన్టీఆర్ రూ. 10 లక్షలు, నందమూరి కళ్యాణ్ రామ్ రూ. 5 లక్షలు, మహేష్ బాబు రూ. 10 లక్షలు, రవితేజ రూ. 5 లక్షలు, అల్లు అర్జున్ రూ. 25 లక్షలు, సంపూర్ణేష్ బాబు రూ. 50 వేలు, వరుణ్ తేజ్ రూ. 3 లక్షలు, ప్రభాస్ రూ. 15 లక్షలు, శంకరాభరణం టీమ్ రూ. 5 లక్షలు ప్రకటించారు.