శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Modified: గురువారం, 30 జూన్ 2016 (19:03 IST)

తిరుపతి రైల్వే స్టేషన్‌లో దళారీలు... రైల్వే పోలీసులకే మామూళ్లు...?

మీరు రైల్‌ టికెట్‌ బుక్‌ చేసుకోలేదా... గమ్యస్థానాలకు ఎలా చేరుకోవాలి అనుకుంటున్నారా... అయితే అధైర్యపడవద్దు...తిరుపతి రైల్వేస్టేషన్‌లో కావాల్సినంతమంది దళారీలు ఉన్నారు. వీరు ఏం చేస్తారా అని అనుకుంటున్నారు కదూ. ఇక్కడ కథంతా నడిపించేది వీరే. వచ్చి వెళ్ళే ర

మీరు రైల్‌ టికెట్‌ బుక్‌ చేసుకోలేదా... గమ్యస్థానాలకు ఎలా చేరుకోవాలి అనుకుంటున్నారా... అయితే అధైర్యపడవద్దు...తిరుపతి రైల్వేస్టేషన్‌లో కావాల్సినంతమంది దళారీలు ఉన్నారు. వీరు ఏం చేస్తారా అని అనుకుంటున్నారు కదూ. ఇక్కడ కథంతా నడిపించేది వీరే. వచ్చి వెళ్ళే రైళ్ళలోని జనరల్‌ బోగీలలో ఎక్కి మీకు సీటు పట్టి పెడతారు. పెద్దగా వీరికి ఇవ్వాల్సింది ఏమీ లేదు. 100 నుంచి 150 రూపాయలు ఒక్కొక్కరి నుంచి వసూలు చేస్తారంతే. అది కూడా ఒక్కో సీటుకు మాత్రమే సుమీ. అలా వచ్చి పోయే రైళ్లలో ప్రతి జనరల్‌ బోగీలో వీరే ఉంటారు. వీరి సంపాదన ఏంటో.. అసలు వీరు ఎంతమంది ముఠాగా ఉన్నారో తెలుసుకోవాలంటే ఈ కథనం చూడండి...
 
తిరుపతి. ఈ ప్రాంతం అంటూ తెలియని వారుండరు. ప్రపంచంలోనే పేరొందిన తిరుమల క్షేత్రంతో పాటు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎన్నో పుణ్యక్షేత్రాలు ఇక్కడ ఉన్నాయి. ప్రతిరోజు 50 నుంచి 70వేలమంది భక్తులు తిరుమలకు వస్తూ పోతూ ఉంటారు. అలాంటి తిరుపతి లాంటి క్షేత్రంకు వచ్చే భక్తులను సులువుగా మోసం చేస్తున్నారు కొంతమంది దళారీలు. భక్తులకు అవసరమయ్యే వాటిని అధికరేట్లకు విక్రయిస్తూ డబ్బులు దండుకుంటున్నారు. 
 
భక్తులకు గానీ, ప్రజలకు గాని అవసరమైనది ప్రయాణం. అందులో ప్రధానమైనది రైలు ప్రయాణం. బస్సు ప్రయాణం చేసేవారి కన్నా రైలు ప్రయాణం చేసేవారి సంఖ్య రోజురోజుకో పెరుగుతోందని కేంద్ర రైల్వేశాఖ స్వయంగా ప్రకటించింది. వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చే భక్తులు కూడా రైళ్లలోనే ఎక్కువగా తిరుపతికి చేరుకుంటుంటారు. అలాంటి తిరుపతి రైల్వేస్టేషన్‌లో దళారీల హవా అంతా ఇంతా కాదు. వీరు చెప్పిందే ఇక వేదం. అసలు రైళ్లు వీరి కోసమే వేశారా అన్న అనుమానం రాకమానదు.
 
ప్రతిరోజు పదుల సంఖ్యలో తిరుపతికి రైళ్లు వస్తూ పోతూ ఉంటాయి. ఒక్క ప్రాంతం అని చెప్పలేము. ఎన్నో ప్రాంతాల నుంచి తిరుపతి వైపుగానే రైళ్లు వెళుతుంటాయి. ప్రతి రైలులోను జనరల్‌ బోగీ ఖచ్చితంగా ఉంటుంది. ఆ జనరల్‌ బోగీనే కొంతమంది దళారులకు డబ్బులను తెచ్చిపెడుతోంది. అది కూడా వేలల్లోనే. నమ్మశక్యం కాని నిజాన్ని నమ్మక తప్పని పరిస్థితి ఇక్కడ. తిరుపతి రైల్వేస్టేషన్‌కు వచ్చే రైళ్ళు స్టేషన్‌కు రెండుకిలోమీటర్ల దూరంలో ఆగి ఆ తరువాత నెమ్మదిగా వస్తుంటుంది. అలాంటి రైళ్లలోని జనరల్‌ బోగీలలో సీట్లను పెట్టి భక్తులను నిలువు దోపిడీ చేసేస్తున్నారు.
 
టికెట్ కొనుక్కోని కొంతమంది భక్తులు జనరల్‌ బోగీలకు వెళుతుంటారు. అలాంటి బోగీలలో టవళ్లు, ఖర్ఛీప్‌లను వేస్తుంటారు దళారీలు. స్టేషన్‌లోకి రైలు వెళ్లగానే ఈ సీట్లు మావంటూ భక్తులతో గొడవకు దిగుతుంటారు. కొద్దిసేపు తరువాత సీటు మీకిచ్చేస్తాను మాకెంత ఇస్తావంటూ బేరం పెడతారు. మొదటగా 300 నుంచి బేరం స్టార్ట్ చేసి చివరకు ఒక్క సీటు 100 నుంచి 150రూపాయలకు ఇచ్చేస్తారు. అలా ఎన్ని సీట్లు ఉంటే అంత డబ్బులన్నమాట. ఇది కొత్తగా జరుగుతున్న తతంగమేమీ కాదు. ఎన్నోనెలలుగా జరుగుతోంది.
 
జనరల్‌ బోగీల్లో దళారులు ఒకరిద్దరనుకుంటే తప్పులో కాలిసినట్లే. వీరు సుమారు 100 మందికి పైగా ముఠాగా ఉన్నట్లు సమాచారం. ఈ ముఠాగా ఏర్పడిన దళారీలు సంపాదించిన డబ్బులో సగం రైల్వేపోలీసులకే అనే విమర్శలున్నాయి. అది కూడా 15 రోజులకో నెలరోజులకో మామూళ్లు కాదు. ప్రతిరోజు మామూళ్లు వెళ్ళాల్సిందే. క్రిందిస్థాయి నుంచి పైస్థాయి రైల్వే అధికారి వరకు ప్రతి ఒక్కరికీ ఈ మామూళ్లు పోతుంటాయని వాదన ఉంది. ఇంకేముంది తమకేమీ సంబంధం లేనట్లు రైల్వేపోలీసులు సైలెంట్‌ అయిపోతున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. 
 
దీనిపై ఎన్నోసార్లు కొంతమంది రైల్వేపోలీసులు భక్తులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే వారు చెప్పే సమాధానం వింటే ఆశ్చర్యమేస్తుంది.. మాకూ ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయి. వెంటనే వారిని పట్టుకుంటామంటూ చెప్పి వారిని అక్కడి నుంచి పంపేస్తారు. ఇప్పటికైనా ఈ విషయంపై రైల్వే ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.