1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
  4. For the sake of rank, the girl goes to bed at 3 am and wakes up at 6 am

ర్యాంక్ కోసం, ఆ అమ్మాయి తెల్లవారు జామున 3 గంటలకు పడుకుని ఉదయాన్నే 6 గంటలకు లేస్తోందట

girl tension on study
కర్టెసీ: జెమినీ ఏఐ ఫోటో
అప్పట్లో తల్లిదండ్రులు ఒరేయ్ లేచి చదవండి అంటూ నాలుగైదు సార్లు గట్టిగా లేపితే కానీ లేచి చదివేవాళ్లు కాదు. దానికి కారణం రోజంతా పాఠశాలలోనో లేదంటే వారివారి స్నేహితులతోనో శరీరం అలసిపోయేట్లుగా ఆడుకుని వచ్చేవారు. ఆదమరిచి నిద్రపోయేవారు. ఇప్పటి పిల్లలకు అసలు ఆ నిద్ర ఏదీ?

పోటీ పరీక్షలు. పక్కవాడు ర్యాంకు తెచ్చుకున్నాడని ఇంట్లో వున్న పిల్లవాడిని నిద్రపోనీయని తల్లిదండ్రులు ఒకవైపు వుంటే, మనకి ర్యాంకులూ ఏమీ వద్దు లోకజ్ఞానానికి చదవండి పిల్లలూ అని చెప్పినా వారికంటే నాకు ఎక్కువ మార్కులు రావాలంటూ రాత్రనక పగలనక మేల్కొని కళ్లు కాయలు కాచేలా నిద్రాహారాలు మానుకుని చదివే పిల్లలు ఇంకోవైపు. ఇలాంటి వారితో తల్లిదండ్రులు భయాందోళనలకు గురవుతున్నారు. వారి ఆరోగ్యానికి ఎలాంటి హాని జరుగుతుందోనని. తాజాగా సోషల్ మీడియాలో దీనిపైనే చర్చ జరుగుతోంది. శ్రీనివాస్ అనే నెటిజన్ తన అనుభవాన్ని ఈ క్రింది విధంగా పంచుకున్నారు.
 
మా మేనత్త కొడుకు చిన్న కొడుక్కి జేఈఈలో 99.986 పర్సెంటైల్ వచ్చింది. 
 
రెండేళ్ళ పాటు ఆ పిల్లాడు నరక యాతన పడ్డాడు. తిన్నది వంటబట్టేది కాదు. జేఈఈ సాధిస్తానా లేదా అని టెన్షన్. వాళ్ళ పెద్దోడు ఒక ఎన్ఐటీ కొట్టాడు. కనీసం అది కొట్టలేమోనని వీడి భయం. 
 
తల్లిదండ్రులకు ర్యాంకులు ముఖ్యం కాదు. ఇంటికి వెళ్దాం అంటే ఒప్పుకోడు. వారం వారం హైదరాబాద్ వచ్చి చూసి వెళ్లేవారు. తరచూ డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సి వచ్చేది. 
 
ఇప్పుడు వాడికి ర్యాంకు వచ్చింది అని కూడా పేరెంట్స్ ఎక్కడా చెప్పుకోలేదు. హమ్మయ్య ఒక తంతు ముగిసింది అని సంతోషపడ్డారు అంటూ పేర్కొన్నారు.
 
షాన్ అనే మరొకట నెటిజన్ రాస్తూ.. ఈరోజుల్లో పిల్లల పరిస్థితి అలాగే వుంది. నా క్లోజ్ ఫ్రెండ్ కుమార్తె 11వ జెఈఈ కోచింగుకు వెళ్తోంది. తెల్లవారు జామున 3 గంటలకు నిద్రపోయి మరలా ఉదయాన్నే 6 గంటలకు లేస్తుంది. వీకెండ్ టెస్ట్ వస్తే ఇక నిద్రకూడా పోదు. ఆమె తల్లిదండ్రులు ఆమె గురించి ఎంతో టెన్షన్ పడుతున్నారు. కానీ అదేమీ ఆమె పట్టించుకోవడంలేదు.
 
శ్రీకాంత్ అనే మరో నెటిజన్ రాస్తూ... ఆరోగ్యమే మహాభాగ్యం, ఈ విషయాన్ని పేరెంట్స్ ఎప్పుడు తెలుసుకుంటారో.
 
వాస్తవం అదే. ఎన్ని చదువులు చదివినా, ఎన్ని ర్యాంకులు సాధించినా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తే సాధించినవన్నీ చేజారినట్లే కదా. కనుక పాతకాలంలో పెద్దలు చెప్పినట్లు శరీరం చమటతో తడిసేలా శారీరక శ్రమ, కడుపు నిండా భోజనం చేసి కంటి నిండా నిద్ర పోతుంటే చాలు. ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా దానంతట అదే వస్తుంది.
About Writer
సిహెచ్