గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఠాగూర్

కొత్త యేడాదిలో అమల్లోకి రానున్న న్యూ రూల్స్

కొత్త సంవత్సరంలో పలు రకాలైన కొత్త నిబంధనలు అమల్లోకిరానున్నాయి. వ‌చ్చే జ‌న‌వ‌రి ఒకటో తేదీ నుంచి ఫాస్టాగ్‌తోపాటు జీఎస్టీ, చెక్ మోసాలు, పాజిటివ్ పే వ్య‌వ‌స్థ‌లాంటి వాటిలో నిబంధ‌న‌లు మారుతున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మార్పులపై ఇప్పటికే పచ్చజెండా కూడా ఊపింది. 
 
ఈ మార్పుల్లో భాగంగా, వచ్చే యేడాది జనవరి 15వ తేదీ నుంచి ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్ ఫోన్‌కు కాల్ చేయాలంటే ఖచ్చితంగా ముందు 0 యాడ్ చేయాల్సిందేన‌ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలిక‌మ్యూనికేష‌న్స్ (డీఓటీ) స్ప‌ష్టంచేసింది. 
 
అలాగే, వ‌చ్చే యేడాది జ‌న‌వ‌రి 1 నుంచి కాంటాక్ట్‌లెస్ కార్డ్ లావాదేవీ ప‌రిమితిని పెంచుతూ ఆర్బీఐ ఈ మ‌ధ్యే కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇందులో భాగంగా ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న రూ.2 వేల ప‌రిమితిని రూ.5 వేల‌కు పెంచింది. అయితే ఇది పూర్తిగా వినియోగ‌దారు విచక్ష‌ణాధికారంపైనే ఆధార‌ప‌డి ఉంటుంది. అంటే యూజ‌ర్ కావాల‌నుకుంటే ఈ ప‌రిమితిని రూ.5 వేల‌కు పెంచుకోవ‌చ్చు. లేదంటే రూ.2 వేలకే ప‌రిమితం చేయ‌వ‌చ్చు.
 
ఇకపోతే, జ‌న‌వ‌రి 1, 2021 నుంచి చెక్కుల‌కు పాజిటివ్ పే వ్య‌వ‌స్థ‌ను తీసుకురానున్న‌ది రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ). ఇందులో భాగంగా రూ.50 వేల‌కు మించిన చెక్కుల విష‌యంలో కీల‌క వివ‌రాల‌ను మ‌రోసారి నిర్ధారించాల్సిన అవ‌స‌రం రావ‌చ్చు. చెక్కు జారీ చేసే వ్య‌క్తి చెక్కు నంబ‌ర్‌, తేదీ, పేయీ పేరు, అకౌంట్ నంబ‌ర్‌, అమౌంట్ వంటి వివ‌రాల‌ను వెల్ల‌డించాల్సి ఉంటుంది. 
 
ముఖ్యంగా, వ‌చ్చే యేడాది జ‌న‌వ‌రి 1 నుంచి ఫాస్టాగ్‌ను త‌ప్ప‌నిస‌రి చేస్తూ కేంద్ర రోడ్డు, ర‌వాణా, హైవేల మంత్రిశ్వ శాఖ నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఈ కొత్త నిబంధ‌న‌ల ప్ర‌కారం.. డిసెంబ‌ర్ 1, 2017కు ముందు త‌యారైన అన్ని నాలుగు చ‌క్రాల వాహ‌నాల‌కు ఫాస్టాగ్ త‌ప్ప‌నిస‌రిగా ఉండాల్సిందే. ఈ మేర‌కు కేంద్ర మోటారు వాహ‌నాల చ‌ట్టం, 1989లో స‌వ‌ర‌ణ‌లు చేశారు.