శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ESHWAR
Last Updated : బుధవారం, 16 జులై 2014 (11:50 IST)

పబ్ అంటే ఏంటి? దీని గొడవేంటి?

భారతదేశం భిన్న సంస్కృతుల సమాహారం. ప్రతీ కల్చర్‌ని ఆదరించి అభిమానించే స్వభావం మనది. అందుకే ప్రేమికుల దినోత్సవాన్ని కూడా గౌరవిస్తాం. పబ్ కల్చర్‌కి చిందులేస్తాం. ఎంతగానంటే విదేశీయులు కూడా ఇండియాలో పబ్ కల్చర్ చూసి ముచ్చటపడేంత మందుకెళ్లాం. అందుకే అహ్మదాబాద్ నుంచి అనాకపల్లి వరకూ ఉన్న యవత ఈ కల్చర్‌కి పిచ్చగా కనెక్ట్ పోయి హుషారుగా ఊగిపోతూ మద్యం మత్తులో తూగిపోతుంది. అసలు ఇంతకీ పబ్బేంటి? దీని గొడవేంటి? పబ్ కల్చర్ వల్ల తలెత్తుతున్న అనర్థాలేంటి? దీని కొనసాగించాలా? కట్టడి చేయాలా..?
 
పబ్ అనేది సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ మూలంగా డాలర్లతో పాటు ఇండియాకు కొచ్చిన ఒకానొక కల్చర్. అంతకుముందు ఎక్కడుంతో తెలియని ఈ నయా కల్చర్ ప్రపంచీకరణ ప్రభావంతో ఐటీ కారిడార్స్‌లో చిందులు తొక్కేస్తుంది. వారాంతం అససి పోయి వీకెండ్‌లో మ్యూజిక్‌ హోరులో జిగేల్‌మనే లైట్లతో పెగ్‌ల మీద పెగ్‌లు కొడుతూ పిచ్చ ఎంటర్‌టైన్మెంట్‌గా తయారైంది. పబ్ కెళ్లడాన్ని వారాంతపు విడుపుగా భావించే వరకూ వచ్చేసింది. అంతేనా వారంలో ఒక రోజు లేడీస్ స్పెషల్ డేగా నిర్వహించే వరకూ వ్యవహారం వచ్చేసిందంటే ఏ రేంజ్‌లో మనవాళ్ల కనెక్ట్ అయిపోయారో చూడండి.
 
మాములుగా ఆడమగా కలసి స్పృహలో ఉండి చేసే పనులే అప్పుడప్పుడూ అదుపు తప్పుతుంటాయ్. అలాంటిది, మద్యం పీకలదాకా తాగిన తర్వాత, డ్రగ్స్ కిక్కు తల కెక్కిన తర్వాత అసలు మన వంటి మీద ఎవడు చెయ్యి వేస్తున్నాడో.. ఏమి చేస్తున్నాడో.. తెలియదు సరికదా.. ఒకవేళ తెలిసినా మనం ఆపే పరిస్థితీ ఉండదూ.. మనం ఆగే పరిస్తితి అంతకన్నా ఉండదు...
 
దేశం నలుమూలలా పబ్ కల్చర్ ప్రభావంతో చోటుచేసుకున్న అవాంఛనీయ సంఘటనలకు ఎన్నో దృష్టాంతాలున్నాయి. మన కళ్లకు కనపడుతూనే ఉన్నాయి కదా.... పబ్ మాయలో తాగేసి రోడ్డెక్కి నానా రభస చేసిన టీనేజ్ అమ్మాయిలను ఎంతమందిని చూడలేదు. ఆధునిక పోకడల్లో ఓ అడుగు ముందుండే హైదరాబాద్‌లో పబ్స్‌ మందు కిక్కు చాలదన్నట్టు డ్రగ్స్‌ ఎంటరవుతున్నాయి. స్పృహలో లేని శరీరాలు కొన్నిచోట్ల హద్దులు దాటుతున్నాయి. తాగూ వూగు.. జోగు.. ఇదీ పబ్‌ మెయిన్ కాన్సెప్ట్.. అందుకే కాసేపు మైమరిపించే మరో ప్రపంచంలో విహరించాలని యూత్‌ అట్రాక్ట్ అవుతోంది.
 
మన సంస్కృతికి ఈ కల్చర్‌ కరెక్ట్ కాదన్నది సంప్రదాయవాదుల మాట. కానీ సంప్రదాయానికీ, పర్యాటకానికీ లింకు పెట్టి మాట్లాడుతున్నారు కేంద్రమంత్రి శ్రీపాదలాంటి వాళ్లు. నిజానికి పబ్ కల్చర్ బ్యాన్ చేయడానికి టూరిజం డెవలప్‌మెంటుకూ లింకుందా? పబ్ కల్చర్‌లో మూలసూత్రం నీ ఇష్టం వచ్చినట్టు తాగు. ఊగూ.. వాగు.. కావాల్సినంత సేపు ఆడు పాడు.. ఆడామగా భేషజాలేం ఉండవు. పబ్‌ కల్చర్‌లో యూత్‌కి అట్రాక్టివ్‌ అంశాలివే. నిజానికి టూరిస్టులు దీనికి బాగా ఆకర్షితులవుతారు. ఈ పద్ధతి ఎంత కట్టడి చేస్తే టూరిస్టుల రాక అంత తగ్గుతుంది. తగిన స్వేచ్ఛను ఇచ్చినప్పుడే వచ్చే వాళ్ల సంఖ్య అధికమవుతుందని ఇప్పటికి ఎన్నో సార్లు నిరూపితమైందంటారు విశ్లేషకులు. 
 
ఉదాహరణకు గోవా బీచ్‌లో బికినీలు బ్యాన్ చేయాలని అంటే ఇక అక్కడికి రావడం ఎందుకూ? అనేవారి సంఖ్య ఎక్కువే. సముద్ర తీరంలో సేద తీరడానికి బికినీ వేసుకోవడాన్ని ఓ సాధారణ విషయంగా భావిస్తారు విదేశీ టూరిస్టులు. వాటిని ధరించే వారు అందులో అసభ్యతను చూడరు. దాన్నో సౌలభ్యంగా మాత్రమే భావిస్తారు. ఒంటి నిండా బట్టలేసుకుని సన్ బాత్ చేయలేం కదా? అలాంటప్పుడు బికినీలనే బ్యాన్ చేస్తాననడం ఎంత వరకూ సమంజసం? అన్నది వీరి వాదన..
 
పబ్ కల్చర్ మన దేశానికి సరిపడదు.. దీన్ని నిషేధించాల్సిందే అన్నది కేంద్ర పర్యాటక శాఖామంత్రి శ్రీపాద అభిప్రాయం. ఇలా చేస్తే పర్యాటకరంగం అభివృద్ధి చెందదనేది కూడా ఈయన వాదనే కావడం విశేషం. కరెక్టే.. ఎవరిష్టమొచ్చినట్టు వాళ్లు చేయడానికి వీలు లేని పరిస్థితుంటే ఎవరుమాత్రం ఎందుకొస్తారు? అన్నది సహజంగానే వినవచ్చే ప్రశ్న. కానీ దీని అంతరార్థం ఏంటంటే ఇలాంటివాటిని ప్రోత్సహించడంద్వారా వచ్చే అభివృద్ధి అవసరం లేదు. 
 
మన సంప్రదాయానికి ఈ పబ్ కల్చర్ సరిపడదు కాబట్టి.. దీని స్థానే ప్రత్యామ్నాయాలను ఆలోచించాలన్నది సదరు మంత్రివర్యుల మనసులో మాట. ఆయన అంతరార్థం ఎలా ఉన్నా... దేశంలో పబ్‌కల్చర్‌ని కట్టడి చేయడం జరిగే పనేనా అన్నది... ఇప్పట్లో సమాధానం దొరకని ప్రశ్నే.. విదేశీ కరెన్సీ కోసం పాలకులు ఆరాట పడితే బంగారం లాంటి యువత బూడిదై పోవడం మాత్ర ఖచ్చితం అంటున్నారు మానసిక విశ్లేషకులు.