బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Eswar
Last Modified: శనివారం, 19 జులై 2014 (13:37 IST)

వృత్తి టీస్టాల్... నెలకు రూ.15 కోట్లు ఆర్జన... ఎలా సాధ్యం? అదే ఎర్రబంగారం...

ఎర్రచందనం స్మగ్లింగ్‌ను చంద్రబాబు ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. నిందితులు ఎంతటి వారైనా కఠినంగా వ్యవహరించాలంటూ పోలీస్ అధికారులకు తాఖీదులు జారీ చేసింది. ఫ్రభుత్వ ఆదేశాలతో పోలీస్ యంత్రాగం అప్రమత్తమై నిందితుల వివరాలు సేకరించే పనిలో పడింది. ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డూ అదుపూ లేకుండా సాగిపోతున్న నేపథ్యంలో స్పెషల్ స్టోరీ...
 
చదివింది ఐదో తరగతి. వృత్తి టీస్టాల్, ఆదాయం రూ. 50 లక్షలు అంటే అందరూ టీస్టాల్ పెట్టుకోవడానికి ఇష్టపడుతారు. అయితే టీస్టాల్ చాటున ఎర్రచందనపు స్మగ్లర్‌గా మారి ఏకంగా నెలకు 15 కోట్లు సంపాదిస్తోన్నాడో స్మగ్లర్. ఇంత ఆదాయం వుంది కాబట్టే ఎర్రచందనపు అక్రమ రవాణాలో అందరు పాత్రధారులయ్యారు.
 
చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో వున్న శేషాచలం అడువుల్లో వున్న ఎర్రచందనం పుణ్యామా అని వేల సంఖ్యలో అక్రమదారులు కోటీశ్వరులయ్యారు. వెయ్యిమందికి పైగా వందల కోట్ల ఆస్తిని సంపాదించారు. చిత్తూరు, కడప, తిరుపతితో పాటు మద్రాసు, బెంగళూరు, హైదరబాద్‌లలో పెద్దఎత్తున ఆస్తులు సంపాదించారు. చివరకు 500 ఓటర్లు వున్న పంచాయితీకి ఏకంగా కోటి రూపాయలు ఖర్చు చేసి సర్పంచ్‌లయ్యారు. ప్రస్తుతం చిత్తూరు పోలీసుల అధీనంలో 100 మందికి పైగా ఎర్రచందనపు స్మగ్లర్లు వున్నారు. పోలీసులు తెలిపిన విశ్వసనీయ సమాచారం మేరకు ఈ వందమంది కూడా ఈ పది సంవత్సరాలలో కోట్లకు పడగలెత్తిన వారే.
 
1. గంగిరెడ్డి- కడప జిల్లాకు చెందిన గంగిరెడ్డి తన హత్యకు కుట్రపన్నాడంటూ సిఎం చంద్రబాబు నాయుడు గవర్నర్‌కు లేఖ రాయడంతో ఇతని పేరు బయటకు వచ్చింది. ఇతను 2004 నుంచి ఈ వ్యాపారం చేస్తూ భారీ ఎత్తున అక్రమ రవాణా స్వంత వాహనాలలో చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈయన పోలీస్ అధికారులకు సైతం నివాస గృహాలు కట్టించినట్లు విమర్శలున్నాయి. ఇతని ఆస్తి ఏకంగా రూ. 500 కోట్లు పైమాటేనట..
 
2. విజయానందరెడ్డి- చిత్తూరు వాసి. బుల్లెట్ సురేష్‌కి అనుచరుడిగా ఉంటూ తర్వాత తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని ఏర్పరచుకుని వ్యాపారం సాగిస్తున్నాడు. ఇతను 2014 ఎన్నికల్లో రెండు నియోజకవర్గాలకు ఎన్నికల  ప్రచారం కోసం నిధులు సమకూర్చినట్టు సమాచారం. లారీ క్లీనర్‌గా జీవితం ప్రారంభించిన విజయానందరెడ్డి ఇప్పుడు అపర కోటీశ్వరుడు
 
3. రెడ్డినారాయణ- కడప జిల్లా వ్యక్తి. ఇతను 2004, 05 కాలంలో భారీఎత్తున ఎర్రచందనం అక్రమ రవాణా చేసినట్లు సమాచారం. ఇతను పోలీసులకు అప్పట్లోనే లక్షలలో ముడుపులు ఇచ్చాడని సిఐడి ఎంక్వయిరీ కూడా నడిచింది. మదనపల్లి మిల్క్ డైరీతో పాటు తిరుపతిలో షాపింగ్ కాంప్లెక్స్ ఓ కార్పోరేట్ స్కూల్ కూడా వున్నట్లు సమాచారం. 500 కోట్లకు పైగా ఆస్తులు వుంటాయని అభిప్రాయం.
 
4. బుల్లెట్ సురేష్- చిత్తూరులో ప్రముఖుడు. అయితే ఇతను గతంలో ఓ మాజీ మంత్రి సహచరుడిగా వుంటూ ఎర్రచందనపు అక్రమ వ్యాపారం చేసేవాడనే విమర్శ ఉంది. అయితే ఇతను కూడా ఆర్థికంగా బాగానే సంపాదించినట్లు సమాచారం. అయితే ఇతని అనుచరుడు ఇతనిని మోసం చేసి ఇతనికంటే ఎక్కువ సంపాదించినట్టు సమాచారం. 
 
చిత్తూరు పోలీసుల ఎదుట ప్రవేశ పెట్టిన వారి వివరాలు చూస్తే మరింత ఆశ్చర్యమనిపిస్తుంది. కర్నాటకలోని కటికెనహల్లికి చెందిన రియాజ్ ఖాన్ ఐదవ తరగతి చదివి కిరణా వ్యాపారం చేస్తూ శ్రీగంధం అక్రమ రవాణా చేస్తూ దక్షిణ భారతదేశంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా మారాడు. ఇప్పటివరకు వెయ్యి టన్నుల ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేసినట్లు తెలుస్తోంది. అంటే ఏకంగా 500 కోట్ల మేర సంపాదించినట్లు సమాచారం. ఇతని నెలవారి ఆర్జన 15 కోట్లు వుంటుందని పోలీసుల అంచనా. మరో స్మగ్లర్ శరవణన్ పెరంబదూర్ వాసి. ఇప్పటివరకు 600 టన్నుల ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసాడనే ఆరోపణలున్నాయి. ఇతని నెల ఆదాయం పదికోట్లు ఉంటుందని అంచనా.
 
ఇక చిత్తూరుకు చెందిన ఆయిల్ రమేష్ ఇంటర్ వరకు చదివాడు. గాలికి తిరిగేవాడట. అయితే 2011 నుంచి ఎర్రచందనపు అక్రమ రవాణాలోకి ప్రవేశించాడు. ఇతను నేరుగా విదేశీ స్మగ్లర్లత సంబంధాలు పెట్టుకున్నాడనే విమర్శ ఉంది. మూడు సంవత్సరాల కాలంలో ఏకంగా 500 టన్నులు విదేశాలకు తరలించాడట. ఎర్రచందనపు అక్రమ రవాణా విషయంలో అన్ని జిల్లాల పోలీసుల కంటే చిత్తూరు జిల్లా పోలీసులు మాత్రం సీరియస్‌గా వర్క్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఏకంగా 175 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 10మంది మీద పిడి యాక్ట్ కేసు నమోదు చేసి వారిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.