గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Updated : శుక్రవారం, 15 జులై 2016 (14:15 IST)

తితిదే ఉద్యోగుల అరణ్య రోదన... ఇక ఆ తిరుమల వెంకన్నే దిక్కు!

తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు గతంలో ఎన్నడూ లేనంత అసంతృప్తితో ఉన్నారు. ఇళ్ళ స్థలాలు, వైద్యసదుపాయం వంటి సమస్యల సంగతి అలా ఉంచితే.. సర్వీసుకు సంబంధించి సమస్యలను పట్టించుకునేవారు కరువయ్యారన్న ఆవేదనలో

తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు గతంలో ఎన్నడూ లేనంత అసంతృప్తితో ఉన్నారు. ఇళ్ళ స్థలాలు, వైద్యసదుపాయం వంటి సమస్యల సంగతి అలా ఉంచితే.. సర్వీసుకు సంబంధించి సమస్యలను పట్టించుకునేవారు కరువయ్యారన్న ఆవేదనలో ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. ఉద్యోగుల సర్వీసు వ్యవహారాలను చూడాల్సిన విభాగం పనితీరుపైన ఆ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జేఈఓను సైతం విస్మరించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరుతో కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న వారూ మనోవేదనకు గురవుతున్నారు.
 
అనారోగ్యంతో బాధపడేవారు, కుటుంబ సమస్యలు ఎదుర్కొంటున్నవారు, దీర్ఘకాలం ఒకోచోట పనిచేస్తున్నవారు తమకు కాస్తోకూస్తో వూరట లభించే చోటికి బదిలీ కోరుకోవడం పరిపాటి. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల్లోను ఇలాంటి అంశాలకు ప్రాధాన్యత ఉంటుంది. అయితే తితిదేలో మానవతా దృక్పథంలో చేపట్టే బదిలీలకు చోటే లేకుండా పోయింది. ఇలాంటి వారు ఎవరైనా బదిలీ కోసం సర్వీసెస్‌ విభాగానికి వెళితే.. సంబంధిత అధికారి ఒకరు వ్యంగ్యంగా ఎగతాళిగా, హేళనగా మాట్లాడి ఉద్యోగులను మనస్తాపం కలిగించేలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
ఇటీవల ఒక మహిళా ఉద్యోగి తనకు చంటిబిడ్డ ఉందని, బిడ్డను చూసుకోవడానికి అనుకూలంగా ఉండే చోటికి బదిలీ చేయమని అభ్యర్థిస్తే బిడ్డను తీసుకెళ్ళి పక్కనే ఉయ్యాల కట్టి వూపుకో అంటూ వ్యంగ్యంగా మాట్లాడారట. తల్లిదండ్రులు అనారోగ్యంతో బాధపడుతున్నారనే కారణంగా మరో ఉద్యోగి బదిలీ అడిగితే.. పదపద. మాకూ ఉన్నారు అమ్మానాన్నా.. అని ఎగతాళిగా మాట్లాడి పంపుతారట. బదిలీ కోసం దరఖాస్తు ఇస్తే ఆ దరఖాస్తును మళ్ళీ ఉద్యోగి చేతిలోనే పెట్టి మీ డిప్యూటీ ఈఓను రమ్మను చూద్దాం.. నువ్వు పదపద అని అందరి ముందు అవహేళనగా మాట్లాడుతారట. ఈ పరిస్థితుల్లో బదిలీ కోసం సర్వీసెస్ విభాగానికి వెళ్ళాంటేనే ఉద్యగులు భయపడిపోతున్నారు.
 
ఉద్యోగులు అడిగేవాటిలో కొన్ని చేయగలిగినవి ఉంటాయి. కొన్ని చేయలేనివి ఉంటాయి. ఉద్యోగులు అడిగినవన్నీ చేయలేకపోవచ్చు. అయితే బదిలో కోసమనో, ఇంకో సమస్యతోనే తన వద్దకు వచ్చినప్పుడు అధికారి ఓపిగ్గా వింటే ఆ ఉద్యోగికి సగం ఊరట లభిస్తుంది. సంస్థ తన గురించి పట్టించుకుంటుందని, ఈ రోజుకాకున్నా రేపటికైనా సమస్య పరిష్కారమవుతుందని ఉద్యోగిలో నమ్మకం ఏర్పడుతుంది. అలాకాకుండా వారికి మనస్తాపానికి గురి చేస్తే ఆ అధికారిపైన పెల్లుబికే వ్యతిరేకత మెల్లగా సంస్థపైకి మళ్ళుతుంది. ప్రస్తుతం తితిదే సర్వీసెస్‌ విభాగంలో జరుగుతున్నది అదే. తితిదేలో ఏ ఉఉద్యోగిని కదిలించినా సర్వీసెస్‌ విభాగంలోని ఆ అధికారి వ్యవహారశైలిపైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయనకంటే కింది స్థాయి ఉద్యోగులు, అధికారులనేకాదు తనకంటే ఉన్నతాధికారులతోను అదే రీతిగా వ్యవహరిస్తారని సమాచారం.
 
సర్వీసెస్‌ విభాగంలో పనిచేసే ఉద్యోగులు ఆ అధికారి తీరుతో హడలెత్తిపోతున్నారు. ఫైల్స్ చూపించడానికి వెళితే ఆ ఫైలుకు సంబంధంలేని ప్రశ్నలు వేస్తారట. వేలాకోళం చేస్తారట. ఉద్యోగులను ఆడామగా తేడా లేకుండా అభ్యంతరకర పదజాలంతో సంబోధిస్తారట. ఒక ఏఈఓ అఫ్రూవల్‌ చేసిన ఫైలును అంతకన్నా కిందిస్థాయి ఉద్యోగి ముందు పెట్టి తనిఖీ చేస్తారట. ఒక సూపరింటెండెంట్‌, ఏఈఓ చూసి సంతకాలు పెట్టిన ఫైలును మరో కేస్‌ వర్కర్‌తో తనిఖీ చేయించడం వారికి అనుమానించడం కాదా అని వారు ప్రశ్నిస్తున్నారు. తన వద్ద పనిచేసే సిబ్బందిని వేళాపాళా లేకుండా ఆఫీసుకు రమ్మంటారట. ఉదయం 7-8గంటల కల్లా రమ్మంటారట. రాత్రి పొద్దుపోయేవరకు ఇంటికి వెళ్ళనివ్వరట. మహిళా ఉద్యోగులను రాత్రి 9 గంటల వరకు ఆఫీసులోనే ఉంచుతారట. మహిళలతో ఇలా పనిచేయించడం చట్ట విరుద్ధం. ఆ స్థాయి అధికారికి ఈ విషయం తెలియదనుకోలేం. ఉద్యోగులను వ్యక్తిగతంగాను అవహేళన చేస్తున్నాట. ఒక ఉద్యోగి చేతికి ఉంగరాలు, బ్రాస్‌లెట్‌ వేసుకుని వచ్చారట. ఆయన్ని చూసిన ఆ అధికారి ఏ పని చేయాల్సి వచ్చినా చేతికి ఉంగరాలు, బ్రాస్‌లెట్‌ ఘనంగా ఉన్నాయి. 
 
ఆయనకు ఇవ్వండి చేస్తాడు అంటూ ఎగతాళిగా మాట్లాడడం మొదలుపెట్టారట. దీంతో ఆ ఉద్యోగి రెండోరోజు ఉంగరాలు, బ్రాస్‌లెట్‌ తీసేసివవ్చారట. ఆయన గారి వేధింపులు భరించలేక ఓ ఉద్యోగి రాజీనామా చేసేందుకు సిద్ధపడినట్లు సమాచారం. మరో ఉద్యోగి ఆత్మహత్మాయత్నం కూడా చేశారని తెలుస్తోంది. మరో ఉద్యోగి ఎదురు తిరిగి ప్రశ్నించినందుకు ఫైల్స్‌లో అడ్డగోలు రాతలు రాసి వేధిస్తున్నారట. ఇంకో ఇద్దరు ఉద్యోగులు తాము ఇక్కడ పని చేయలేమని, ఎక్కడికైనా బదిలీ చేయమని ఆయన్నే అడిగారట. సర్వీసెస్‌ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అక్కడి నుంచి వెళ్ళిపోతామా అనే భావనతో ఉన్నారు. నిత్యం మనోవేదనక కుమిలిపోతున్నారు.
 
తితిదే సర్వీసు నిబంధనల ప్రకారం ఏ ఫైలుగానీ ఈఓకు వెళ్లేముందు సర్వీసెస్‌ ఇన్‌ఛార్జి అయిన తిరుపతి జేఈఓ పోలా భాస్కర్‌కు వెళ్ళాలి. అయితే ఈ అధికారి జేఈఓను విస్మరించి ఈఓ సాంబశివరావు వద్ద తనకున్న గౌరవాన్ని అభిమానాన్ని దుర్వినియోగం చేస్తూ ఫైళ్ళు ఈఓ ముందు పెడుతున్నారట. జేఈఓ ప్రమేయం లేకుండా అఫ్రూవల్‌ అయిన ఫైళ్ళు అనేకం ఉన్నాయట. ఉద్యోగులు ఏ చిన్నపని అడిగినా రూల్స్ ఏకరుపెట్టే అధికారికి జేఈఓ అనుమతి లేకుండా ఫైళ్ళు క్లియర్‌ చేయడం నిబంధనలకు వ్యతిరేకమని తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. ఈ అధికారి వచ్చినప్పటి నుంచి ఇదే తంతట. నాకెందుకులే అని జేఈఓ కూడా దీనిపై మిన్నకుండిపోతున్నారు. ఈయన కార్యాలయంలోనే ఫైల్స్ నేల మీద చిందరవందరగా పరిచేసి ఉంటాయి. ఏ కార్యాలయంలోనైనా ఫైల్స్ ఈ విధంగా పెట్టుకుంటే క్రమశిక్షణా రాహిత్యం అవుతుంది. కార్యాలయాలను స్మార్ట్‌గా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యం కూడా. ఇలాంటి ఉద్దేశం ఏ కోశాన ఇక్కడ కనిపించదు.