"నేస్తమా" ఇద్దరి లోకం ఒకటేలేవమ్మా...!!

Ganesh|
WD
సృష్టిలో రెండక్షరాల తియ్యని బంధమే "స్నేహం". స్నేహం అనిర్వచనీయమైంది, అద్భుతమైంది. ప్రతి మనిషి జీవితంలోనూ... ఏ ప్రతిఫలాన్ని ఆశించని "స్నేహం" బంధం మొగ్గలా ప్రారంభమై, మహావృక్షంలాగా ఎదిగి జీవితాంతం తోడునీడగా నిలుస్తుంది. నిజమైన స్నేహితులకు మించిన ఆస్తి లేదు. స్నేహానికి ఎల్లలు లేవు. సరిహద్దుల్ని చెరిపేసే స్నేహం వికాసానికి బాటలు వేస్తుంది.

ఓ మంచి మిత్రుడు తోడుంటే ఆయుధం ధరించినంత ధైర్యం, స్థ్యైరం ఉంటుంది. జీవితం అనే ఉద్యానవనంలో అందమైన పరిమళభరిత పుష్పమే స్నేహం. ఇది హృదయపు తలుపును ఒక్కసారి తడితే అందులోని మాధుర్యాన్నంతా జీవితకాలం అనుభవించేలా చేస్తుంది. రెండు మనసులకు సంబంధించిన ఈ స్నేహబంధం తరతరాలుగా తరిగిపోని ఆస్థిగా భావితరాలకు పంచుతోంది.

కన్నవారితోను, కట్టుకున్నవారితోనూ, తోడబుట్టినవారితోనూ, కడుపున పుట్టినవారితోనూ చెప్పుకోలేని విషయాలను సైతం మిత్రులతో పంచుకోవడమే స్నేహం యొక్క గొప్పతనం. స్నేహమనేది ఓ మధురమైన అనుభూతి, దీనికి వయసుతో నిమిత్తంలేదు. బాల్యం నుంచి వృద్ధాప్యందాకా ప్రతి మనిషి జీవితంలోనూ స్నేహమనేది పెనవేసుకుపోతుంది.

ఈ సృష్టిలో నా అనేవారు, బంధువులు లేనివారు ఉంటారేమోగానీ... స్నేహితులు లేనివారు ఉండరని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. స్నేహం ప్రకృతి లాంటిది, అది ఆహ్లాదంతోపాటు ఎంతో హాయినీ ఇస్తుంది. స్నేహితులతో కలసి ఉంటే కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేనిది. అయితే ఇద్దరిమధ్యా పవిత్రమైన స్నేహం ఉండాలి. అలాంటి స్నేహంలోనే ఆనందం దాగి ఉంటుంది.


దీనిపై మరింత చదవండి :