"ఫ్రెండ్‌షిప్ డే" కథా కమామీషు...!!

Ganesh|
WD
"కిరణానికి చీకటి లేదు
సిరిమువ్వకి మౌనం లేదు
చిరునవ్వుకు మరణం లేదు
మన స్నేహానికి అంతం లేదు" అంటూ కవితలు రాసినా..."

"దోస్త్ మేరా దోస్త్ తూహీ మేరా జాన్.. వాస్తవం రా దోస్త్.. నువ్వే నా ప్రాణం" అంటూ సినీ కవులు కవిత్వం రాసినా.. స్నేహానికి ఉన్న గొప్పదనం ఎన్ని రకాలుగా చెప్పినా వర్ణించేందుకు వీలుకానిదే...! అది స్వయంగా అనుభవిస్తే తప్ప, అందులోని మాధుర్యం ఎవరికీ అర్థం కాదు. అంతటి ఉన్నతమైన స్నేహానికున్న ప్రాధాన్యతను చెప్పేందుకు ఏర్పాటైనదే "స్నేహితుల రోజు".

అన్నట్టు ఈ స్నేహితుల రోజు వెనుక ఓ పెద్ద కథే ఉంది సుమా..! 1935వ సంవత్సరం ఆగస్ట్ మొదటి శనివారం రోజున అమెరికా ప్రభుత్వం చేతిలో హతమైన తన స్నేహితుడిని మర్చిపోలేని మరో స్నేహితుడు ఆ తరువాత రోజైన ఆదివారంనాడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. దీనికి చలించిపోయిన అమెరికా ప్రభుత్వం ఆగస్ట్ మొదటి ఆదివారాన్ని "నేషనల్ ఫ్రెండ్‌షిప్ డే"గా ప్రకటించింది. ఇక అప్పటినుంచి ఈ ఫ్రెండ్‌షిప్ డే అలా అలా వ్యాపిస్తూ విశ్వవ్యాప్తమయ్యింది.

సాధారణంగా ఒక మనిషి తనకు అవసరమైన బంధువులను, సొంతవాళ్లను ఎంపిక చేసుకునే అవకాశం ఉండదు. కానీ మంచి స్నేహితులను ఎంపిక చేసుకునే అవకాశం మాత్రం ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. ఈ రోజుల్లో ఉన్న ఊరిని, కన్నవారిని వదలి.. ఉన్నత చదువుల కోసం, ఉద్యోగాల కోసం నగరాలకు, విదేశాలకు వలసబాట పట్టినవారికి స్నేహితులే అన్నీ అవుతున్నారు.

కాలేజీల్లో, క్యాంపస్‌లలో, క్యాంటీన్లలో, క్లాస్ బ్రేక్ సమయంలోనూ స్నేహితులు ఒకరిపై ఒకరు వేసుకునే జోకులు, కామెంట్లు, చిలిపి తగాదాల వెనుక అంతర్లీనంగా వారి మధ్య దాగి ఉండే మమతానురాగాలను, ప్రేమ భావాన్ని, స్నేహ భావాన్ని వెలికితెస్తుంటాయి. తప్పు చేసినప్పుడు, చెడు మార్గంలో వెళుతున్నప్పుడు స్నేహితుల సుతిమెత్తని మందలింపులతో జీవితాలను చక్కదిద్దుకున్నవారు ఎందరో ఉన్నారు.

అదలా కాసేపు పక్కన పెడితే... ఈ స్నేహితుల రోజును ఎలా జరుపుకుంటారో ఇప్పుడు చూద్దాం. పలు ప్రాంతాలలో యువతీ, యువకులు తమ స్నేహానికి గుర్తుగా ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌లను పరస్పరం వేసుకుని శుభాకాంక్షలు చెప్పుకుంటారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. స్వీట్లు, గ్రీటింగ్ కార్డుల ద్వారా పరస్పర అభినందనలను తెలియజేసుకుంటారు. కాలేజీ యువతతోపాటు, చిన్నారులు, మహిళలు, ఉద్యోగులు ఈ ఫ్రెండ్‌షిప్ డేను చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు.

చిన్ననాటి స్నేహితులు, పాఠశాల స్నేహితులు, కళాశాల స్నేహితులు, ఆఫీసుల్లోని స్నేహితులు... ఇలా అందరూ పలుచోట్ల సామూహిక విందులను ఏర్పాటు చేసుకుని సంతోషంగా గడుపుతారు. యువతీ, యువకులే కాక అరమరికలు లేని స్నేహానికి గుర్తుగా ప్రాథమిక పాఠశాలల్లో చదివే విద్యార్థులు సైతం ఎంతో ఉత్సాహంగా ఈ రోజును జరుపుకుంటారు.

ఈ రోజుల్లో "అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం" చిన్నారులకు కూడా పెద్ద క్రేజ్‌గా మారింది. ఉదయాన్నే లేచిన చిన్నారులు తమ స్నేహితులను కలవడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తారు. పేరు, పేరున తమ స్నేహితులను గుర్తుంచుకొని వారందరికి ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్‌లు కట్టాలని తల్లిదండ్రుల చెంత మారాం చేసి... ఫ్రెండ్స్‌ ఎంత మంది ఉన్నారో, అన్ని ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్‌లు కొనిపించుకొని మరీ పాఠశాలలకు, స్నేహితుల ఇళ్లకు వెళ్లి ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్‌లు కడుతుంటారు. ఇలాగే స్నేహంలోని సరిగమలను ఆస్వాదిస్తూ.. చిన్నా, పెద్దా బేధం లేకుండా... ఈ స్నేహ మధురిమలను కలకాలం నిలుపుకోవాలని మనసారా కోరుకుందాం...!!


దీనిపై మరింత చదవండి :