శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. »
  3. వెబ్‌దునియా స్పెషల్ 2009
  4. »
  5. ఫ్రెండ్‌షిప్ డే
Written By Ganesh

"నేస్తమా" ఇద్దరి లోకం ఒకటేలేవమ్మా...!!

WD
సృష్టిలో రెండక్షరాల తియ్యని బంధమే "స్నేహం". స్నేహం అనిర్వచనీయమైంది, అద్భుతమైంది. ప్రతి మనిషి జీవితంలోనూ... ఏ ప్రతిఫలాన్ని ఆశించని "స్నేహం" బంధం మొగ్గలా ప్రారంభమై, మహావృక్షంలాగా ఎదిగి జీవితాంతం తోడునీడగా నిలుస్తుంది. నిజమైన స్నేహితులకు మించిన ఆస్తి లేదు. స్నేహానికి ఎల్లలు లేవు. సరిహద్దుల్ని చెరిపేసే స్నేహం వికాసానికి బాటలు వేస్తుంది.

ఓ మంచి మిత్రుడు తోడుంటే ఆయుధం ధరించినంత ధైర్యం, స్థ్యైరం ఉంటుంది. జీవితం అనే ఉద్యానవనంలో అందమైన పరిమళభరిత పుష్పమే స్నేహం. ఇది హృదయపు తలుపును ఒక్కసారి తడితే అందులోని మాధుర్యాన్నంతా జీవితకాలం అనుభవించేలా చేస్తుంది. రెండు మనసులకు సంబంధించిన ఈ స్నేహబంధం తరతరాలుగా తరిగిపోని ఆస్థిగా భావితరాలకు పంచుతోంది.

కన్నవారితోను, కట్టుకున్నవారితోనూ, తోడబుట్టినవారితోనూ, కడుపున పుట్టినవారితోనూ చెప్పుకోలేని విషయాలను సైతం మిత్రులతో పంచుకోవడమే స్నేహం యొక్క గొప్పతనం. స్నేహమనేది ఓ మధురమైన అనుభూతి, దీనికి వయసుతో నిమిత్తంలేదు. బాల్యం నుంచి వృద్ధాప్యందాకా ప్రతి మనిషి జీవితంలోనూ స్నేహమనేది పెనవేసుకుపోతుంది.

ఈ సృష్టిలో నా అనేవారు, బంధువులు లేనివారు ఉంటారేమోగానీ... స్నేహితులు లేనివారు ఉండరని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. స్నేహం ప్రకృతి లాంటిది, అది ఆహ్లాదంతోపాటు ఎంతో హాయినీ ఇస్తుంది. స్నేహితులతో కలసి ఉంటే కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేనిది. అయితే ఇద్దరిమధ్యా పవిత్రమైన స్నేహం ఉండాలి. అలాంటి స్నేహంలోనే ఆనందం దాగి ఉంటుంది.

గాఢమైతే జీవిత గమనాన్నే మార్చేస్తుంది...

ఇదే స్నేహం మరీ గాఢంగా మారిందంటే, అది జీవితాన్నే మార్చేస్తుందన్న విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. కాలంతోపాటు ఈనాడు స్నేహం విలువలు కూడా మారిపోతున్నాయి. ఇద్దరు వ్యక్తుల నడుమ పెరిగిన సాన్నిహిత్యం అనర్థాలకు కూడా దారితీసే ప్రమాదం ఉంది. గాఢమైన స్నేహబంధం వల్ల ఏర్పడే ప్రమాదం అది వారి జీవన విధానాలపై తీవ్రమైన దుష్ప్రభావాలను చూపుతుందని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

టీనేజ్‌లో పెరిగే గాఢమైన స్నేహం ఒక్కోసారి పలు ఉపద్రవాలకు దారితీస్తుంది కాబట్టి, ఆ సమయంలో పెరిగే పరిచయాలపై హద్దులుండాలని వారంటున్నారు. కాబట్టి... ఇలాంటి పరిణామాలను తట్టుకునే ఆత్మస్థైర్యం ఇద్దరిలోనూ ఉండాలని, అవసరాలకు అనుగుణంగా పొరపాట్లను సరిచేసుకునే చొరవ ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

దీనికి అనుగుణంగా స్నేహం ఒడిలోని వెలుగు, చీకటి కోణాలపై దృష్టి సారించి మెలకువ వ్యవహరించాలి. బలహీనతలను ఆసరాగా చేసుకుని పరిచయం చేసుకునేవారితో కాస్త దూరంగానే ఉండటం మంచిది. ఉన్నత భావాలతో సాన్నిహిత్యాన్ని కోరుకునే స్నేహితులకు మాత్రమే స్నేహ హస్తం అందించటం ఉత్తమం. ఇలాంటి స్నేహంలో ఇద్దరూ ఎన్ని రోజులయినా తమ అంతరంగాల్లో మార్పు రాకుండా స్వచ్ఛంగా మెలగాలి.

కల్మషం లేకుండా.. హద్దులెరిగి ప్రవర్తించాలి...
ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడిన మధురమైన స్నేహాన్ని కలకాలం నిలుపుకోవాలంటే... వారు తమ భావాలను వారధిగా చేసుకోవాలి. తమ బంగారు భవితకు దిశానిర్దేశనం చేసే క్రమంలో.. జీవన విధానంలో స్నేహం పలు మార్పులకు గురవుతుంది. కల్మషం లేని స్నేహాన్ని అందిస్తూనే.. ఎల్లప్పుడూ హద్దులెరిగి ప్రవర్తించగలగాలి. ఎలాంటి అవరోధాలూ లేకుండా ఆప్యాయతా, అనురాగాలతో జీవించాలి. మానసిక అంతరాల్ని తొలగించుకునేందుకు సానుకూల దృక్పథాన్ని, క్షమాగుణాన్ని అలవర్చుకునే స్నేహితుల "స్నేహం" కలకాలం వర్ధిల్లుతుంది.