శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. »
  3. బాలప్రపంచం
  4. »
  5. జనరల్ నాలెడ్జ్
Written By Ganesh

జూలై 11 : ప్రపంచ జనాభా దినోత్సవం

నానాటికి పెరుగుతున్న జనాభా.. తద్వారా తలెత్తే దుష్పరిణామాలను ప్రజలకు వివరించేందుకు, వారికి ఆయా సమస్యలపై అవగాహన కలిగించేందుకు ప్రతి ఏటా జూలై 11వ తేదీన "ప్రపంచ జనాభా దినోత్సవాన్ని" నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదలకు, తరుగుదలకు సంబంధించిన విషయాల గురించి ప్రజలలో చలనం తెచ్చేందుకుగాను ఐక్యరాజ్యసమితి 1989వ సంవత్సరంలో దీనిని ప్రారంభించింది.

1987వ సంవత్సరంలో ప్రపంచ జనాభా ఐదు బిలియన్లకు చేరుకున్న రోజు "జూలై 11" కాబట్టి... ఆరోజును "ప్రపంచ జనాభా దినం"గా ఐక్యరాజ్యసమితి గుర్తించింది. ఇక అప్పటినుంచి క్రమం తప్పకుండా ప్రతి ఏడాది జూలై 11వ తేదీన ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఆ రోజునుంచి 20 సంవత్సరాల తరువాత జూలై 11, 2007లో చూస్తే ప్రపంచ జనాభా 6,602,226,175కు చేరుకున్నట్లు ఐరాస వెల్లడించింది.

ఆ తరువాత... 2008 జూన్ 28 నాటికి ప్రపంచ జనాభా 6.7 బిలియన్ల వద్ద ఉండగా, 2012 నాటికి ఏడు బిలియన్లను చేరుకుంటుందని ఐరాస తెలిపింది. మరో యాభై ఏళ్లలో ప్రపంచ జనాభా 9 బిలియన్లను చేరే అవకాశముందని కూడా సమితి పేర్కొంది. కాగా... అమెరికా 304 మిలియన్ల మంది జనాభాతో మూడో స్థానంలో ఉండగా... చైనా, భారత్‌లు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.

పెరుగుతున్న జనాభాలో అభివృద్ధి చెందుతున్న దేశాలు కీలకపాత్ర పోషిస్తున్నట్టు ఈ సందర్భంగా సమితి అభిప్రాయపడింది. భారత్, అమెరికా, చైనా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ తదితర తొమ్మిది దేశాలు వచ్చే 2050 నాటికి ప్రపంచ జనాభాలో సగం శాతాన్ని ఆక్రమిస్తాయని సమితి తెలిపింది.

తమ గణాంకాల ప్రకారం 2050 నాటికి ప్రపంచ జనాభా 9.1 బిలియన్లకు చేరుకుంటుందని... అదేసమయంలో వచ్చే 50ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా మహిళల సంతానోత్పత్తి శాతం సరాసరిగా 2.5 నుంచి 2.1కి పడిపోతుందని తమ గణాంకాల్లో వెల్లడైందని సమితి తెలియజేసింది.

ఐక్యరాజ్య సమితి జనాభా విభాగం వారి అంచనా ప్రకారం.. 1800 నాటికి ప్రపంచ జనాభా ఒక బిలియన్ లోపే ఉంది. తరువాతి బిలియన్ పెరగడానికి 123 సంవత్సరాలు పట్టింది. ఐతే 33 సంవత్సరాలలోనే ఇంకో బిలియన్ పెరిగింది. ఇలా ఉన్నకొద్దీ వేగంగా పెరిగి ప్రస్తుత ప్రపంచ జనాభా 6 బిలియన్లపైనే ఉంది. ప్రస్తుత ప్రపంచ జనాభా 6,671,226,000 (ఆరు వందల అరవై ఏడు కోట్ల 12 లక్షలు)గా ఉంది.

2012 నాటికి భూమిమీద 7 బిలియన్ల జనాభా ఉంటుందని అంచనా. అక్టోబరు 12, 1999 నాటికి ప్రపంచ జనాభా 6 బిలియన్లు (600 కోట్లు) అయ్యిందని ఐరాస ప్రకటన. 1987లో 5 బిలియన్లు అయిన జనాభా 12 సంవత్సరాలలో 6 బిలియన్లు అయ్యింది. ఫిబ్రవరి 25, 2006 నాటికి 6.5 బిలియన్లకు (6,500,000,000 లేదా 650 కోట్లు) చేరుకుంది. ఇక 2050 నాటికి ప్రపంచ జనాభా 9 బిలియన్లు (900 కోట్లు) అవుతుందని ఐరాస అంచనా.

"ఇంతింతై వటుడింతింతై" అన్న చందంగా నానాటికీ పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్లుగా ప్రకృతి వనరులు తరిగిపోతున్నా... వాటిని ఎప్పటికప్పుడు రీఛార్జి చేసుకునేందుకు, లేదా సహజ వనరుల్ని పొదుపుగా వాడుకునేందుకు ఎవరూ ప్రయత్నించటం లేదు. కాబట్టి ప్రకృతి వనరుల ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ, పర్యావరణాన్ని కాపాడుకునేలా చేయాలి.

అలాగే.. జనాభా పెరుగుదల వల్ల కలిగే నష్టాలు, ఆర్థికంగా కుంగిపోవడం, నిరక్షరాస్యత, అవసరాలు తీరకపోవడం, భూమిపై స్థలం సరిపోకపోవడం.. లాంటి సమస్యలను ఆయా ప్రభుత్వాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. ఈ విషయాలపై వారికి క్షుణ్ణంగా అవగాహన కల్పించి, వాళ్లే వాలంటరీగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకునేలా ప్రోత్సహించాలి. ఈ రకంగా ఎవరికివారు జనాభా నియంత్రణకు పూనుకున్నట్లయితే భూమాత భారాన్ని కాస్తయినా తగ్గించినవారవుతాము.