గుజరాత్‌లో అంతుచిక్కని వైరస్.. ఇప్పటికే 22 మంది మృత్యువాత
గుజరాత్ రాష్ట్రంలో అంతుచిక్కని చండీపుర అనే వైరస్ ఒకటి వ్యాపిస్తోంది. ఈ వైరస్ బారినపడి ఇప్పటికే 22 మందికిపైగా ప్రజలు మృత్యువాతపడ్డారు. మరో 35 మందికి ఈ వైరస్ సోకినట్టు సమాచారం. దీంతో ప్రజలు ప్రాణభయంతో వణికిపోతున్నారు. సాధారణ జ్వరంలా మొదలయ్యే ఈ ఇన్ఫెక్షన్ కొన్ని గంటల్లోనే మెదడుపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉండటంతో వైద్యులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో అసలు చండీపుర వైరస్ అంటే ఏంటి? ఇది ఎలా వ్యాపిస్తుంది? లక్షణాలు ఏంటి? చికిత్స ఉందా? పరిశీలిస్తే, రాజ్ఞోవిరిదే కుటుంబానికి చెందినదే ఈ చండీపుర వైరస్ (సీహెచ్పీవీ). దీన్ని తొలిసారి 1965లో భారత్‌లో గుర్తించారు. వర్షాకాలంలో ఎక్కువగా కనిపించే శాండ్ (ఇసుక ఈగ) వల్ల ఇది వ్యాపిస్తుంది. మనుషుల నుంచి మనుషులకు ఈ వైరస్ సోకినట్లు ఇప్పటివరకు ఆధారాలు లేవు.
ఈ వైరస్ ఎక్కువగా 15 ఏళ్లలోపు చిన్నారులపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, శాండ్‌లు ఎక్కువగా ఉండే చోట్ల ప్రమాదం అధికంగా ఉంటుంది. వర్షాకాలంలో ఈగల సంఖ్య పెరగడంతో వైరస్ వ్యాప్తి కూడా ఎక్కువగా కనిపిస్తుంది.
ప్రారంభంలో ఈ వైరస్‌ను గుర్తించడం కాస్త కష్టం. ఎందుకంటే మొదట సాధారణ వైరల్ జ్వరంలాగే కనిపిస్తుంది. జ్వరం, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, నీరసం, ఫ్లూ లక్షణాలు ఉంటాయి. ఈ దశలో చాలామంది సాధారణ జ్వరంగా భావించే అవకాశం ఉంటుంది.
కొంతమంది చిన్నారుల్లో వైరస్ చాలా వేగంగా మెదడుపై దాడి చేస్తుంది. దీంతో మెదడు వాపు (ఎన్ సెఫలైటిస్) వస్తుంది. ఆ తర్వాత పరిస్థితి గంటల వ్యవధిలోనే విషమించవచ్చు. ఈ వైరస్ సోకిన వారిలో మూర్ఛ, స్పృహ కోల్పోవడం, కోమాలోకి వెళ్లడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి.
