బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువుగారి అమెరికా ప్రవచనం ముఖ్యాంశం
Guru Brahmasri Vaddiparthi Padmakar in America
బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు వ్రాసిన ఐశ్వర్యయోగంలోని లలితా సహస్ర నామాలకు వ్యాఖ్యానం
శ్రీ మహాగణాధిపతయే నమః
శ్రీ గురుభ్యో నమః????????
????కృష్ణం వందే జగద్గురుమ్????
47. ఓం మరాళీమందగమనాయై నమః
మరాళీ అనగా ఆడహంస. ఆడహంస నడక చాలా ముచ్చటగా ఉంటుంది. ఆడహంస నడక వంటి నడక అమ్మవారిది. ఎగరడంలో చాలా వేగం చూపించే హంసలు నేలమీద నడచినప్పుడు మెల్లగా నడుస్తాయి. అది నిదానమే ప్రధానమని చాటే నడక. అమ్మవారి నడకను ఎందుకు ప్రదర్శించిందంటే తొందరపాటు అనర్థమని చాటడానికి. సరియైన ఆలోచనతో నడచుకోవడం మంచిదని చెప్పడానికి. హంస అనే శబ్దానికి సూర్యుడని కూడా అర్థం. సూర్యకిరణాలవంటి గమనం కలదని కూడా అర్థం చెప్పవచ్చు. అనగా లోకాలను వెలుతురుతో లేక విజ్ఞానంతో నడిపే తల్లి. పాలు, నీళ్ళు కలసి ఉంటే పాలు త్రాగి, నీరు వేరు చేస్తుంది హంస. జగత్తంతా మంచి చెడ్డల కలయిక కనుక ఇందులో మంచిని గ్రహించి చెడును విడిచిపెట్టమని లోకానికి చెప్పడానికి అమ్మవారు హంసీగమనాన్ని స్వీకరించింది. హంసీ శబ్దానికి సకలలోకజనులను రక్షించే మంత్రమని కూడా అర్థం. అమ్మవారు సకలలోక రక్ష స్వరూపక మంత్రాధిష్ఠానదేవత. మంత్రానికి అనుగుణంగా నడుస్తుంది. లేదా మంత్రాన్ని జపించే తీరునుబట్టి భక్తులకు ప్రత్యక్షమౌతుంది అని మరొక అర్థం.
మంత్రప్రయోగం - ఫలితం
పిల్లల ప్రవర్తన బాగుపడడానికి ఈ మంత్రాన్ని రోజూ 108 సార్లు చొప్పున 41 రోజులు జపించండి. శత్రువులు మిత్రులుగా మారడానికి ఆదివారం ఈ మంత్రం 1008 సార్లు జపించండి. అమ్మవారి సాక్షాత్కారం కావాలని కోరేవారు రోజూ 11 సార్లు “ఓం మరాళీమందగమనాయై నమః" అని జపించండి. చక్కని ఫలితం వస్తుంది.
గమనిక: ఐశ్వర్య యోగంలోని నామములు ప్రతి ఒక్కరూ అనుష్ఠానం చేసుకోవచ్చని, భక్తులకు గురువుగారి సూచన.
