సంవత్సరంలో చిట్ట చివరన వచ్చే పూర్ణమ ఈ హోళికా పూర్ణిమ. లోకంలో ఎవరికైనా చిట్ట చివరి సంతానం అంటే చెప్పలేనంత ఇష్టం. అలాగే ఏడాదిలో చివరిగా వచ్చే ఈ హోళికా పూర్ణిమ కూడాను. అందుకే పెద్దలు ఈ హోళికా పూర్ణిమను ఓ ఉత్సవంలా జరుపుకోవాలని నిర్ణయించారు. ఏడాది పొడవునా సుఖదుఃఖాల సమ్మిళతంగా సాగిపోయిన కాలానికి స్వస్తి చెపుతూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని ఆనంద సాగరంలో మునిగిపోతారు.ఆ రోజన హోళీ జరుపుకున్న ప్రతి ఒక్కరు రంగులతో తడిసి నూతన సౌందర్యాన్ని తెచ్చుకుంటారు. నగలూ-నట్రా మంచి దుస్తులు వేసుకుంటేనే సౌందర్యంగా కనబడతారని చాలామంది అనుకుంటారు. కానీ మహాకవి పింగళి సూరన కళాపూర్ణోదయమనే కావ్యంలో అసలైన సౌందర్యం ఎక్కడుందో చెప్పాడు.