కొత్త ఇంట్లోకి మారటం తలనొప్పి వ్యవహారం

Raju| Last Modified సోమవారం, 7 ఏప్రియల్ 2008 (18:27 IST)
సాఫ్ట్‌వేర్ బూమ్, రియల్ ఎస్టేట్ కారణంగా మహానగరాల్లో ఇల్లు దొరకడమే గగనంగా మారుతున్న రోజులివి. ఇంటి ఓనర్ ఇల్లు ఖాళీ చేయమని చెబితే మరో అద్దె ఇల్లు మనం భరించే స్థాయి కిరాయికి దొరకడం ఈ రోజుల్లో సాధ్యం కావడం లేదు. సంపాదనలో కనీసం 30 నుంచి 40 శాతం అద్దె ఇల్లుకే కేటాయించవలసి రావడంతో సగటు మానవుడికి తల ప్రాణం తోకకు వచ్చినంత పని అవుతోంది.

మరి అద్దె ఇల్లు దొరకడమే కష్టం అనుకుంటే అద్దె దొరికిన తర్వాత పాత ఇంటిలోంచి కొత్త ఇంటికి సామాను తరలించుకుని పోయే క్రమం మరీ ప్రాణాంతకంగా ఉంటోంది. అందుకే కొత్త ఇంటిలోకి మారుతున్నప్పుడు సామాను ప్యాకింగ్ చేయడంలో మెలకువలు పాటిస్తే మన సామాను పదిలంగా ఉంటుంది.

పాత ఇంటికి దగ్గరగా కొత్త అద్దె ఇల్లు దొరికితే సామాను తీసుకెళ్లడం పెద్ద సమస్య కాదు. అయితే కొత్త ఇల్లు పాత ఇంటికి దూరంగా ఉండి మీకు సమయం కూడా తక్కువగా ఉంటే ప్యాకర్స్ కంపెనీని కొనుగోలు చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో సామాను మీరే స్వంతంగా ప్యాక్ చేసుకుంటే సరే. లేదా మీ సమక్షంలోనే ప్యాకింగ్ జరిగేలా చూసుకోవాలి. అప్పుడు ఏ సామాను ఎక్కడుందీ మీకు సులువుగా తెలుస్తుంది.

ముఖ్యంగా టీవీ, ఫ్రిజ్, హీటర్, వాషింగ్ మెషిన్, వాటర్ ఫిల్టర్, కంప్యూటర్ వంటి వాటి కనెక్షన్లను మీరు తీసి పెట్టుకోవాలి. తర్వాత వేరు వేరు గదులకు సంబంధించిన సామాను వేరు వేరు పెట్టెల్లో పెట్టి ప్యాక్ చేసి, పెట్టెపై నెంబర్ వేయడం మర్చిపోరాదు. అవసరం వచ్చినప్పుడు ప్యాకింగ్ విప్పాల్సిన పరిస్థితి రాకుండా డబ్బులు, రిమోట్, మొబైల్ వంటివి బయటే పెట్టుకోవాలి.

వంటింటి సామాను, ఇతర గాజు వస్తువులను అన్నిటికంటే జాగ్రత్తగా ప్యాక్ చేయించుకోవాలి. ప్యాకింగ్ సరిగా లేకపోతే బండి కుదుపులతో అవి పగిలే ప్రమాదం ఉంది. వస్తువులు పగిలితే మనసుకు బాధ కలగడమే కాక, డబ్బులు కూడా నష్టపోవాల్సి ఉంటుంది.

అలాగే సబ్బులు, టవల్స్, టూత్ బ్రస్టులు, బ్రెడ్ షీట్లు, నైట్ డ్రెస్‌లు వంటివి ప్రత్యేకంగా బ్యాగులో కాని సూట్‌కేసులో కాని పెట్టుకోవాలి. ఫర్నీచర్, పెద్ద వస్తువులను గుడ్డలో చుట్టి ప్యాక్ చేయాలి. విప్పిన తర్వాత విడి భాగాల్ని సులభంగా అమర్చుకోగలిగే విధంగా ప్యాక్ చేయాలి. ఉతకాల్సిన బట్టలు ముందుగానే ఉతికి, ఇస్త్రీ చేసి పెట్టుకుంటే ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ప్యాక్ చేయడం సులభమవుతుంది.

మొత్తానికి చూస్తే ఇల్లు మారటం బొమ్మలాట కాదు. సామానంతా ప్యాక్ చేయగానే సరిపోదు. కొత్త ఇంటిలో అన్నింటినీ విప్పి మళ్లీ చక్కగా సర్దుకుని తీరక తప్పదు.


దీనిపై మరింత చదవండి :