శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. »
  3. మహిళ
  4. »
  5. గృహాలంకరణ
Written By Ganesh

పరదాలతో రాచకళ.. ఇదిగిదిగో సాధ్యమే..!

FileFILE
ప్రతిరోజూ సరికొత్త డిజైన్లతో ఇంటీరియర్ వస్తువులు మార్కెట్లోకి ప్రవేశిస్తుంటాయి. అలా వచ్చే ప్రతిదీ కొనుగోలుదారులను సరిగా ఆకట్టుకోలేదనుకో... మరికొన్ని వినూత్నమైన ఆవిష్కరణలు వెలుగులోకి వస్తాయి. ఇలా ఎప్పటికప్పుడు కొత్తగా దర్శనం ఇవ్వడం వల్లనే కర్టెన్ల (పరదాలు)కు రాచకళ ఉట్టిపడటమే గాకుండా.. వాటికి గిరాకీ కూడా బాగా పెరుగుతోంది.

ఇంకా చెప్పుకోవాలంటే... కొన్ని రకాల పరదాలైతే వారి, వారి హోదాలకు చిహ్నంగా మారుతున్నాయంటే ఆశ్చర్యపడాల్సింది లేదు. ఆధునిక జీవన విధానంలో ఈ పరదాలు కూడా ఒక భాగం కావడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఈ సంగతలా ఉంచితే... గృహ సౌందర్యంలో కిటికీలకు, తలుపులకు ఎలాంటి పరదాలను వాడితే బాగుంటాయో ఇప్పుడు చూద్దాం..!
సాయం సంధ్యవేళల్లో..!
  షీర్ పరదాలు ఇళ్లలో ఫ్రెంచి విండోలు, డ్రాయింగ్ రూం లాంటి వాటికి చక్కగా నప్పుతాయి. కిటికీల్లోంచి సాయం సంధ్యవేళల్లో ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు అవి అనువుగా ఉంటాయి. షీర్‌లో బనారస్ సిల్క్ గుడ్డను ఎంచుకుంటే ఇంటికి ఇక రాచకళ వచ్చేసినట్లే..!      


ఇంటి కిటికీలకు, తలుపులకు వాడే పరదాలకు పాలిస్టర్, కాటన్, ఆర్గాంజ్, సింథటిక్, జనపనార, సిల్కు లాంటి బట్టలను ఉపయోగిస్తే మంచిది. సంప్రదాయ పరదాలలో బట్ట ఒక వరుసే ఉండటం వల్ల, ఎండను నిరోధించటంతో పాటు బయటి దృశ్యాలేమీ కనబడనీయకుండా చేస్తాయి.

అయితే... ప్రస్తుతం ప్రైవసీతో పాటుగా, బయటి దృశ్యాలను చూసేందుకు వీలుగా ఉండే "డే షీర్" పరదాలకు విపరీతమైన ఆదరణ పెరుగుతోంది. ఇవి ఎలా ఉంటాయంటే... ప్రధాన పరదాకు అదనంగా ఈ షీర్ పరదా వస్తుందంతే..!

ఇవి సాధారణ పరదాల లాగా కాకుండా బట్ట సన్నగా ఉంటుంది. వీటిల్లో కూడా సరికొత్త డిజైన్లయిన థ్రెడ్ కర్టెన్లు కూడా వెలుగులోకి వచ్చాయి. అవసరాన్ని బట్టి ప్రధాన పరదాను తీసేసి, షీర్ పరదాను మాత్రమే వేసుకునే సౌకర్యం వీటికుంటుంది.

ఇకపోతే... పాలిస్టర్ బట్టతో తయారయ్యే థ్రెడ్ పరదాలను అవసరాన్ని బట్టి ఒకటి, రెండు రంగులతో ఎంచుకోవచ్చు. దారాల మధ్య చిన్న, పెద్ద పూసలతో కూడా ఇవి లభిస్తున్నాయి. వీటిని కిటికీలతో పాటు తలుపులకు కూడా వాడవచ్చు.

ముఖ్యంగా చెప్పుకోవాల్సిందేంటంటే... షీర్ పరదాలు ఇళ్లలో ఫ్రెంచి విండోలు, డ్రాయింగ్ రూం లాంటి వాటికి చక్కగా నప్పుతాయి. కిటికీల్లోంచి సాయం సంధ్యవేళల్లో ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు అవి అనువుగా ఉంటాయి. షీర్‌లో బనారస్ సిల్క్ గుడ్డను ఎంచుకుంటే ఇంటికి ఇక రాచకళ వచ్చేసినట్లే..!

ఆర్గెంజాలో ఎంబ్రాయిడరీ షీర్స్‌కు కూడా మంచి గిరాకీ ఉండగా... అందం, హోదాను ఇవ్వడంలో సిల్కు కర్టెన్లను మించి వేరేవేమీ లేవనే చెప్పుకోవాలి. వీటిల్లో కూడా కొత్తగా వచ్చిన రాసిల్క్ పరదాలకు మంచి డిమాండ్ ఉంది. అలాగే.. చూడ్డానికి నాణ్యమైన సిల్క్ లాగే కనిపించే పాలీ సిల్క్ కూడా కర్టెన్లలో సరికొత్త ఫ్యాషన్‌గా చెప్పుకోవచ్చు.