అమెరికా డ్రోన్ దాడిలో మెహసూద్ భార్య మృతి

Phani|
పాకిస్థాన్ తాలిబాన్ చీఫ్ బైతుల్లా మోహసూద్ ఇంటిపై అమెరికా డ్రోన్ జరిపిన దాడి చేసింది. ఈ దాడిలో మెహసూద్ మృతి చెందినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌లోని దక్షిణ వజీరిస్థాన్ గిరిజన ప్రాంతంలో జరిగిన అనుమానిత అమెరికా డ్రోన్ దాడిలో మెహసూద్ భార్య మృతి చెందినట్లు పాకిస్థాన్ టీవీ ఛానళ్లు బుధవారం వెల్లడించాయి.

మెహసూద్ మామ అక్రముద్దీన్ నివాసంపై డ్రోన్ దాడి చేసినట్లు టీవీ కథనాలు వెలువడ్డాయి. ఈ దాడిలో నలుగురు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. ఇదిలా ఉంటే పాకిస్థాన్‌లోని సమస్యాత్మక నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్‌లో తాలిబాన్ తీవ్రవాదులకు నేతృత్వం వహిస్తున్న మెహసూద్ కోసం ఆ దేశ ఆర్మీ గత కొన్ని వారాలుగా గాలింపు చర్యలు నిర్వహిస్తోంది.

తాజా దాడిలో మృతి చెందినవారిలో మెహసూద్ భార్య కూడా ఉన్నట్లు అతని బంధువులు చెప్పారు. అయితే దీనికి సంబంధించి అధికారిక వర్గాలు ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. డ్రోన్ దాడిలో ఇల్లు మాత్రం ధ్వంసమైందని చెప్పారు. దాడి జరిగిన సమయంలో మెహసూద్ ఇంటిలో పలువురు అతిథులు కూడా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. పాకిస్థాన్‌లోని సమస్యాత్మక గిరిజన ప్రాంతాల్లో ఉన్న తీవ్రవాదుల రహస్య స్థావరాలపై అమెరికా తరచుగా డ్రోన్ దాడులు జరుపుతున్న సంగతి తెలిసిందే.

ఈ దాడులను పాకిస్థాన్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ, అమెరికా యంత్రాంగం మాత్రం వీటిని కొనసాగిస్తూనే ఉంది. దక్షిణ వజీరిస్థాన్‌లో మెహసూద్‌ను పట్టుకునేందుకు, అతని నేతృత్వంలోని తాలిబాన్లను అణిచివేసేందుకు గత కొన్ని నెలలుగా పాకిస్థాన్ ప్రభుత్వం సైనిక ఆపరేషన్ కూడా చేపట్టింది.


దీనిపై మరింత చదవండి :