బంగ్లాదేశ్‌లో హిందూ వితంతువుపై అత్యాచారం.. చెట్టుకు కట్టేసి.. జుత్తు కత్తిరించి...
బంగ్లాదేశ్‌లో మైనార్టీ హిందువులపై హత్యలు, అఘాయిత్యాలు, దాడులు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఆ దేశంలో నెలకొన్న అస్థిరత కారణంగా దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే పలువురు హిందూ యువకులను కొందరు దుండగులు హత్య చేశారు.
తాజాగా ఓ హిందూ వితంతువుపై ఇద్దరు కామాంధులు అత్యాచారం చేశారు. బాధితురాలని చెట్టుకు కట్టేసి, జుత్తు కత్తిరించి చిత్రహింసలు పెట్టారు. ఈ దారుణం జెనాయిద్ జిల్లా కలియా గంజ్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే,
ఓ హిందూ వితంతు మహిళ రెండున్నరేళ్ల క్రితం షాహిన్, ఆయన సోదరుడి నుంచి నందిపారాలో మూడు సెంట్ల స్థలం, రెండంతస్తుల భవనాన్ని 20 లక్షల టాకాలకు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఆమెపై షాహిన్ కన్నేసి అసభ్యకర ప్రతిపాదనలు చేస్తూ పలు రకాలుగా వేధించడం ప్రారంభించాడు.
శనివారం సాయంత్రం ఆమె స్వగ్రామం నుంచి కొందరు బంధువులు వచ్చిన సమయంలో షాహిన్, అతడి స్నేహితుడు షాహిన్‌లు ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డారు. ఆమెపై అత్యాచారం చేశారు. పైగా 50 వేల టాకాలు (రూ.37,000) ఇవ్వాలని డిమాండు చేశారు.. కేకలు వేస్తూ రోదిస్తున్న ఆమెను బయటనున్న చెట్టుకు కట్టేసి, జుత్తును కత్తిరించారు. స్పృహ కోల్పోయేవరకు కొట్టారు. నిందితులను అరెస్టు చేసినట్టు పోలీసులు చెప్పారు.