1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Donald Trump’s Iran Warning: ‘Last Chance’ For Deal Or Face Military Action

హర్మూజ్ జలసంధి : ఇరాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అమెరికా

donald trump
ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోమారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ముడి చమురు రవాణాకు అత్యంత కీలకంగా ఉన్న హర్మూజ్ జలసంధిని తెరుస్తారా లేదా అంటూ గట్టిగా గర్జించారు. ఈ జలసంధిని సాధ్యమైనంత త్వరగా తెరవాలని లేదంటే తీవ్రమైన దాడులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఇరాన్‌తో తమ చర్చలు సానుకూలంగా సాగుతున్నా వాటిని ఆ దేశం బహిరంగంగా ఖండించడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ఈసారి చర్చల నుంచి వెనక్కి తగ్గితే పరిణామాలు అత్యంత తీవ్రంగా ఉంటాయని టెహ్రాన్‌ను హెచ్చరించారు.
 
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద దాడికి అమెరికా సిద్ధమవుతున్న సమయంలో ఇరాన్‌ తమను సంప్రదించి చర్చలకు రావాలని కోరిందని ట్రంప్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇరాన్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై మరో 48 గంటల్లో స్పష్టత వస్తుందని తెలిపారు. టెహ్రాన్‌ అణ్వాయుధాలు కలిగి ఉండేందుకు అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోదని అధ్యక్షుడు పునరుద్ఘాటించారు. 
 
హర్మూజ్ జలసంధిలో నౌకల స్వేచ్ఛాయుత రాకపోకలకు సంబంధించి ఇరాన్‌, ఒమన్‌తో కలిసి తాము చర్చలు జరుపుతున్నామని అగ్రరాజ్యం వెల్లడించింది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్‌ తెలిపారు. అయితే ఈ ప్రకటనను ఇరాన్ ఖండించింది. ఒమన్‌తో తాము జరుపుతున్న చర్చల్లో అమెరికా భాగస్వామ్యం ఏమాత్రం లేదని తెలిపింది. 
 
తమ సార్వభౌమాధికారాన్ని, భద్రతా ప్రయోజనాలను కాపాడే కొత్త సముద్ర రవాణా విధానాన్ని ఏర్పాటు చేయడంపైనే ఈ చర్చలు సాగుతున్నాయని పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్‌ తాజా హెచ్చరికలు చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏ మలుపు తిరుగుతాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
రాజీనామా చేస్తే జస్ట్ రెండు నిమిషాల్లో ఆమోదిస్తాం : ఎమ్మెల్యేలకు సీఎం డీకే హెచ్చరిక