1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Donald Trump Informs Congress of Renewed Iran Strikes, Invokes Fresh 60-Day War Powers Window

ఇరాన్ లక్ష్యంగా మరో 60 రోజుల పాటు అమెరికా యుద్ధం : ట్రంప్ సన్నాహాలు..

Trump Latest Statement on Iran
పశ్చిమాసియాలో మరోమారు ఉద్రిక్తతలు నెలకొననున్నాయి. ఇరాన్ లక్ష్యంగా మరో 60 రోజుల పాటు యుద్ధం చేయాలని ఆమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. ఈ మేరకు ఆయన అమెరికా కాంగ్రెస్‌కు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు వార్‌ పవర్స్‌ నోటీసు ఇచ్చారు. 
 
జులై 7న యుద్ధం ప్రారంభ తేదీగా అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. 'అమెరికా ప్రజలను, జాతీయ భద్రత, విదేశాంగ విధాన ప్రయోజనాలను పరిరక్షించడం నా బాధ్యత. దానికి అనుగుణంగానే సైనిక చర్యకు ఆదేశించాను' అని ట్రంప్ ఆ నోటీసులో పేర్కొన్నారు.
 
అమెరికా నిబంధనల ప్రకారం.. యుద్ధాన్ని ప్రకటించే అధికారం కేవలం అగ్రరాజ్య పార్లమెంట్‌ (కాంగ్రెస్‌)కు మాత్రమే ఉంది. అధ్యక్షుడికి లేదు. అందుకే... అమెరికా అధ్యక్షులు ఏ దేశంపై పోరుకు వెళ్లినా తాము సైనిక చర్య చేపట్టాం అని చెప్తుంటారు. అమెరికన్‌ కాంగ్రెస్‌ ఆమోదం పొందకుండా సైన్యాన్ని అలా వాడటానికి వారికున్న గరిష్ఠ గడువు 60 రోజులే.
 
మామూలుగా శత్రు భూభాగంలోకి తమ సైనిక దళాలను పంపిన 48 గంటల్లోగా కాంగ్రెస్‌కు ఆ విషయాన్ని అధ్యక్షుడు తెలపాలి. 60 రోజుల్లోగా కాంగ్రెస్‌ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. లేదంటే ఆలోగా సైనిక చర్య ఆగిపోవాలి. యుద్ధాన్ని విరమించి సైనికులను సురక్షితంగా తెచ్చేందుకని చెప్పి మరో 30 రోజుల గడువు తీసుకోవచ్చు.  
 
ఫిబ్రవరి 28న ఇరాన్‌‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు ప్రారంభించాయి. అప్పుడు 60 రోజుల డెడ్‌లైన్ మే ఒకటితో ముగిసింది. పలు దేశాల మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్ అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. దాంతో తొలిదఫాలో ప్రారంభించిన సైనిక చర్య అక్కడితో ఆగిపోయిందని ట్రంప్ ప్రభుత్వం చెప్పింది. 
 
తాజా ఘర్షణలతో కొత్తగా మళ్లీ సైనిక చర్యను ప్రారంభించేందుకు అవకాశం ఉందని సమర్థించుకుంటోంది. కానీ రాజ్యాంగ నిపుణులు ఈ వాదనను ఖండిస్తున్నారు. అనధికారిక, శాశ్వత యుద్ధాన్ని కొనసాగించేందుకు ఈ తాత్కాలిక దౌత్య విరామాలను ఒక ఎత్తుగడగా ఉపయోగించుకుంటున్నారని విమర్శిస్తున్నారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
క్రిడిట్ కార్డుతో ప్రీమియం చెల్లింపులను నిలిపివేసిన ఎల్.ఐ.సి