Doomsday Fish: పాములా మిలమిల మెరిసే చేపలు.. సముద్రం నుంచి బయటికి.. అపశకునమా?
ఇరాన్‌పై ఇప్పటికే ఇజ్రాయేల్, అమెరికా సంయుక్త దాడులు చేస్తున్న నేపథ్యంలో.. డూమ్స్‌డే పిష్ కనిపించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మెక్సికోలోని కాబో సాన్ లూకాస్ బీచ్‌లో రెండు అరుదైన ఓర్‌ఫిష్‌లు కనిపించడం ప్రళయ కాలానికి సూచనగా భావిస్తున్నారు.
ఈ చేపలు ఒడ్డుకు కొట్టుకురావడంతో త్వరలో భూకంపం సంభవించవచ్చుననే భయాందోళనలు ప్రారంభమైనాయి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చేపలు సముద్రానికి 3వేల అడుగుల లోతులో నివసిస్తాయి. పాములా పొడవుగా వుండే ఈ చేపలను చూడటం అత్యంత తీవ్రమైన అపశకునంగా భావిస్తారు.
మోనికా పిట్టెంజర్ అనే మహిళ, తన సోదరితో కలిసి బీచ్‌లో ఉండగా ఈ చేపల్ని చూశారు. ఆపై ఈ అరుదైన చేపలను వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జపనీస్ జానపద స్టోరీల ప్రకారం ఈ చేపలు సముద్ర ఉపరితలంపై కనిపిస్తే భూకంపాలు, సునామీలు వంటి ప్రకృతి విపత్తులు సంభవిస్తాయని ఓ నమ్మకం ఉంది.
ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఈ నమ్మకాలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.