1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. FBI Offers 50,000 Dollars Reward For 'Most Wanted' Gangster Goldy Brar

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ - గోల్డీపై అమెరికాలో కేసు : 50 వేల డాలర్ల రివార్డు

Lawrence Bishnoi
భారత్‌ - కెనడా దేశాల దౌత్యసంబంధాల్లో ఒడుదొడుకులకు దారితీసిన ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్ నిజ్జర్ హత్యకేసులో కీలకపరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, అతడి సహచరుడు గోల్డీబ్రార్‌పై అమెరికాలో కేసు నమోదైంది. నిజ్జర్‌ను హత్యచేయాలని వారి నుంచి ఆదేశాలు అందాయని అమెరికా దర్యాప్తు అధికారులు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. 
 
అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంతర్జాతీయస్థాయిలో 'ఆపరేషన్ హార్డ్‌బాల్‌'ను చేపట్టింది. దానిలో భాగంగా అమెరికా, కెనడా, ఐరోపావ్యాప్తంగా బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన 24 మంది మంది అనుమానితులు అరెస్టు అయ్యారు. ఈ నేపథ్యంలోనే బిష్ణోయ్, గోల్డీబ్రార్‌ అభియోగాలు నమోదయ్యాయి. గోల్డీపై 50,000 డాలర్ల రివార్డును కూడా ప్రకటించింది. 
 
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ 2023లో బ్రిటిష్‌ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన వెనక భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ అప్పట్లో కెనడా ప్రధానిగా ఉన్న ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. వీటిని భారత్ తీవ్రంగా ఖండించింది. వాటిని సమర్థించే ఆధారాలు ఇవ్వాలని.. ఆ తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని పలుమార్లు స్పష్టంచేసింది. 
 
అయినప్పటికీ కెనడా ఈ ఆరోపణలు చేయడం మానుకోలేదు. అక్కడితో ఆగకుండా ఈ హత్య కేసు అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్‌ సంజయ్‌కుమార్‌ వర్మ పేరును చేర్చడంతో ఉద్రిక్తతలు మరింత తీవ్రతరమయ్యాయి. దీంతో ఇరుదేశాలు పరస్పరం దౌత్యవేత్తలను వెనక్కి పంపించాయి కూడా. తర్వాత మార్క్ కార్నీ అధికారంలోకి వచ్చాక సంబంధాల్లో పునరుద్ధరణ ప్రారంభమైన సంగతి తెలిసిందే.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఈపీఎఫ్ చందాదారులకు శుభవార్త - మరో వారం రోజుల్లో వడ్డీ సొమ్ము జమ