నా గుండె కోసం దెబ్బలు తగిలినా ఓర్చుకుంటున్నా: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిత్యం వార్తల్లోనే వుంటున్నారు. తాజాగా ఆయన చేతికి గాయం వుండటం కలకలం రేగింది. ఆ గాయాన్ని చూసిన ఓ రిపోర్టర్ దాని గురించి ఆయనను ప్రశ్నించారు. దానికి ఆయన సమాధానమిస్తూ... టేబులుకి నా చేయి తగిలి గాయం అయ్యింది. దానిపై క్రీం రాసాను. నేను సంపూర్ణ ఆరోగ్యంగా వున్నానని వైద్యులు చెబుతున్నా నా గుండె కోసం నేను ఆస్ర్పిన్ మాత్రలు వాడుతున్నాను. ఈ టాబ్లెట్ వేసుకుంటే చిన్న దెబ్బ తగిలినా అది వెంటనే కనిపిస్తుందంటూ చెప్పుకొచ్చారు.
నన్ను టచ్ చేస్తే భూమ్మీద వుండరు
అమెరికా-ఇరాన్ దేశాల మధ్య రోజురోజుకీ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇరాన్ లీడర్ అయాతుల్లా అలీ ఒంటెద్దు పోకడకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని ట్రంప్ పిలుపునివ్వడంపై ఇరాన్ సైనికాధికారి స్పందిస్తూ... తమ నాయకుడిపై దాడి చేసేవారి చేతులు నరికేస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అంతేకాదు... తమ నాయకుడికి ఏదైనా జరిగితే పరిణామాలు తీవ్రంగా వుంటాయని హెచ్చరించారు.
దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ... మీరు నన్ను చంపుతారా? పొరబాటున ఆ పని చేసారంటూ ఇక మీరు ఈ భూమ్మీద వుండరు. నాపై ఎలాంటి దాడి జరిగినా, దాని వెనుక ఒకవేళ ఇరాన్ వుంటే, ఆ దేశాన్ని భూమండలం పైనుంచి పూర్తిగా తుడిచి పెట్టేయమని నేను మా అధికారులకు ముందుగానే సూచించాను. కనుక నాకేమీ భయంలేదు. టచ్ చేస్తే మాడిమసైపోయేది మీరే అంటూ తీవ్ర హెచ్చరికలు చేసారు.