ఇరాన్‌తో కాల్పుల విరమణ ముగిసింది : డోనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
పశ్చిమాసియాలో మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా, ఇరాన్ దేశాలు పరస్పరం ఒకరిపై ఒకరు బాంబుల వర్షం కురిపించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో కాల్పుల విరమణ ముగిసిందన్నారు. నాటో కూటమి శిఖరాగ్ర సమావేశం కోసం ట్రంప్ తుర్కియేలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇరాన్-అమెరికా చర్చల గురించి ప్రస్తావించారు.
'నా దృష్టిలో అంతా ముగిసిపోయింది. వారితో నేను ఇక డీల్ చేయను. నేను మన ప్రతినిధులతో మాట్లాడాను. వారు చర్చలు జరపాలని అనుకుంటున్నారు. మనవాళ్లు మంచివాళ్లు. కానీ వారు చివరకు నా దగ్గరకు వచ్చే మాట్లాడాలి కదా. నా విషయానికి వస్తే.. ఈ చర్చలతో సమయం వృథా' అని పేర్కొన్నారు.
అలాగే గతరాత్రి ఇరాన్‌లోని ప్రమాదకర వ్యక్తులపై తాము శక్తిమంతమైన దాడులు చేశామని వెల్లడించారు. 'మేం అంత్యక్రియలు చేసుకోండని చెప్తే.. వారు నౌకలపై దాడులు చేశారు. అందుకే మేం బలంగా ఢీకొట్టాం' అని అమెరికా దాడులు చేసిన విషయాన్ని మీడియా వద్ద ప్రస్తావించారు. ఇన్ని వ్యాఖ్యలు చేసినా.. చివరకు చర్చలకు అనుమతిస్తానని ట్రంప్ పేర్కొనడం గమనార్హం.
హర్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తోన్న మూడు నౌకలపై ఇరాన్ దాడులు చేసిన సంగతి తెలిసిందే. అందుకు ప్రతిగా ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, తీరప్రాంత నిఘా వ్యవస్థలపై అమెరికా వైమానిక దాడులు చేసింది. దీనిపై ఐఆర్‌జీసీ తీవ్రంగా స్పందించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అగ్రరాజ్యం ఉల్లంఘించిందని ఆరోపించింది. బహ్రెయిన్, కువైట్‌లో అమెరికాకు చెందిన 85 సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు ప్రయోగించింది. ఇలా పరస్పర దాడులతో గల్ఫ్ దేశాల్లో సైరన్ల మోత మోగుతోంది.
