1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. India’s bold MSG at UN calls for adoption of Comprehensive Convention on Int’l Terrorism

సీమాంతర ఉగ్రవాదంతో తీవ్రంగా నష్టపోతున్న భారత్

united nation
సీమాంతర ఉగ్రవాదంలో తీవ్రంగా నష్టపోతున్నట్టు ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్ తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిపే పోరాటంలో ఎలాంటి రాజీ లేదని భారత్ పునరుద్ఘాటించింది. ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని వెల్లడించింది. ప్రపంచ ఉగ్రవాద నిరోధక వ్యూహంపై ఐక్యరాజ్యసమితి తాజాగా జరిపిన సమీక్షలో భాగంగా భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ మాట్లాడారు. 
 
'ఉగ్రవాది ఉగ్రవాదే. ఉగ్రవాదాన్ని సమర్థించడానికి ఎలాంటి కారణాలు వెతకకుండా.. ఈ హంతక భావజాలాన్ని సమూలంగా నిర్మూలించడానికి మనమంతా కలిసికట్టుగా పనిచేయాలి' అని మనదేశం తరపున హరీశ్ పిలుపునిచ్చారు. సీమాంతర ఉగ్రవాదం వల్ల భారత్‌ భారీగా నష్టపోతోందని, ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయని ఆయన పేర్కొన్నారు.
 
'సొంత ప్రజలకు కలిగిన ఈ వేదన భారతదేశ వైఖరిలో మార్పు తీసుకువచ్చింది. రాజకీయ కారణాలు, వ్యూహాత్మక లెక్కలతో సంబంధం లేకుండా ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో నిస్సందేహంగా ఖండించాలి. అంతర్జాతీయ సమాజం అంగీకరించిన ప్రేమ్‌వర్క్ లేకపోవడం వల్ల.. టెర్రరిజానికి వ్యతిరేకంగా కలిసికట్టుగా చర్యలు తీసుకోవడం వీలుకావడం లేదు. నియమ నిబంధనల్లో ఈ లోపాలను సరిచేసేలా, ఉగ్రముఠాలకు నిధులు, ఆయుధాలు అందకుండా నిరోధించేలా చట్టాలు ఆవశ్యకం' అని పర్వతనేని హరీశ్‌ పేర్కొన్నారు.
 
ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరిని విడనాడి.. ఒక్కతాటిపైకి రావడానికి అవసరమైన రాజకీయ సంకల్పాన్ని ప్రదర్శించాలని సభ్యదేశాలను కోరారు. డ్రోన్లు, ఏఐ, డీప్‌ఫేక్, వర్చువల్ కరెన్సీలు, డార్క్‌వెబ్‌ వంటి సాంకేతికతలను ఉగ్రవాద సంస్థలు విస్తృతంగా ఉపయోగించుకుంటున్నాయని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఉగ్రదాడులతో నేరుగా ప్రభావితమయ్యే బాధితులకు పునరావాసం కల్పించే ప్రయత్నాలపైనా అంతర్జాతీయ సమాజం దృష్టిసారించాలని కోరారు.
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
సప్తపది వంటి ఏడు ప్రమాణాలు చేయకపోతే ఆ పెళ్లి చెల్లదు.. గుజరాత్ హైకోర్టు