1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. India strongly criticised Pakistan at the United Nations Security Council during the Annual Open Debate on Protection of Civilians in Armed Conflict

నరమేథం సృష్టించే దేశం మాకు నీతులు చెబుతుందా? భారత్

inida vs pakistan
నరమేథం సృష్టించే దేశం మాకు నీతులు చెబుతుందా అంటూ పాకిస్థాన్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వేదికగా కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాకిస్థాన్‌కు భారత్ మరోమారు ధీటైన సమాధానం ఇచ్చింది. నరమేథం సృష్టించిన చరిత్ర ఉన్న దేశం.. భారత్ అంతర్గత విషయాలపై మాట్లాడటం హాస్యాస్పదమని ఎండగట్టింది. 'సాయుధ ఘర్షణల్లో పౌరుల రక్షణ'పై జరిగిన చర్చను పాక్ పక్కదారి పట్టించే ప్రయత్నం చేయగా భారత్ గట్టిగా తిప్పికొట్టింది.
 
భద్రతా మండలిలో పాకిస్థాన్ ప్రతినిధి ఉద్దేశపూర్వకంగా జమ్మూ కాశ్మీర్ ప్రస్తావన తెచ్చారు. అంతర్జాతీయ చట్టాలు, ఉన్నత విలువల గురించి మాట్లాడుతూ భారతన్ను విమర్శించే ప్రయత్నం చేశారు. సాయుధ ఘర్షణల అంశాన్ని అడ్డం పెట్టుకుని భారత అంతర్గత విషయాలను ప్రపంచ వేదికపైకి తెచ్చి రాజకీయం చేయాలని చూశారు.
 
ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి హరీశ్ పర్వతనేని పాక్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. సొంత దేశంలో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే పాక్ ఇతర దేశాలపై హింసను ప్రేరేపిస్తోందని కుండబద్దలు కొట్టారు. కాశ్మీర్ అంశం పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని, ఇందులో పాకిస్థాన్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
 
ఈ యేడాది మార్చిలో రంజాన్ మాసంలో ఆఫ్ఘన్‌పై పాక్ చేసిన వైమానిక దాడులను భారత్ గుర్తుచేసింది. కాబూల్లోని ఆసుపత్రిపై పాక్ జరిపిన దాడిలో 269 మంది పౌరులు చనిపోయారని తెలిపింది. ప్రార్థనలు ముగించుకుని వస్తున్న అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవడం పాక్ పిరికితనానికి నిదర్శనమని దుయ్యబట్టింది.
 
పాక్ సైన్యం గతంలో చేసిన ఘోరాలను భారత్ ప్రపంచం ముందు పెట్టింది. 1971లో 'ఆపరేషన్ సెర్చ్ లైట్' పేరుతో పాక్ ఆర్మీ సొంత పౌరులపైనే అణచివేతకు పాల్పడిందని గుర్తుచేసింది. లక్షలాది మంది మహిళలపై పాక్ సైనికులు దారుణాలకు ఒడిగట్టారని తెలిపింది. సొంత ప్రజలను బాంబులతో చంపే దేశం అంతర్జాతీయ చట్టాల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని భారత్ పేర్కొంది. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి