గురువారం, 19 ఫిబ్రవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 జనవరి 2026 (10:21 IST)

డోనాల్డ్ ట్రంప్‌కు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ టీవీ.. ఈ సారి గురి తప్పదంటూ కథనం

donald trump
ఇరాన్, అమెరికా దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనివున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇరాన్ ప్రభుత్వ టీవీలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి ప్రత్యక్ష హత్యా బెదిరింపుతో కథనం వచ్చింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది. 2024 జూలై 13వ తేదీన పెన్సిల్వేనియాలో ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం ఫోటోను ప్రసారం చేస్తూ ఈసారి గురి తప్పదు అనే పర్షియన్ క్యాప్షన్‌ను జోడించింది. బుధవారం ఈ సంచలన ప్రసారం జరిగినట్టు అంతర్జాతీయ వార్తా సంస్థ ఏజెన్స్ ఫ్రాన్స్ ప్రెస్ వెల్లడించింది.
 
కాగా, గత 2024లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్బంగా ట్రంప్‌పై దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన చెవికి తూటా గాయమైంది. ఆనాటి రక్తంతో ఉన్న ఫోటోనే ఇపుడు ఇరాన్ టీవీ ప్రసారం చేసింది. దేశంలో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను ఇరాన్ ఉక్కుపాదంతో అణచివేస్తున్న నేపథ్యంలో అమెరికా సైనిక చర్యకు దిగవచ్చనే హెచ్చరికలు వెలువడుతున్నాయి. 
 
ఈ క్రమంలో ఖరార్‌లోని అల్ ఉదెయిద్ వైమానిక స్థావరం నుంచి అమెరికా కొంతమంది సైనిక సిబ్బందిని ముందు జాగ్రత్తగా ఉపసంహరించుకుంది. ఇరాన్ ప్రభుత్వ అనుకూల ర్యాలీ ప్రదర్శించిన ఒక ప్లకార్డు చిత్రాన్నే టీవీలో చూపినట్టు కొన్ని నివేదికలు చెబుతున్నాయి.