సోమవారం, 9 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 మార్చి 2026 (10:52 IST)

గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై భీకర దాడులు చేస్తున్న ఇరాన్... వణికిపోతున్న అరబ్ దేశాలు

bomb attack
గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు చేస్తోంది. ఈ దాడుల వల్ల గల్ఫ్ దేశాలకు తీవ్ర ఆస్తి నష్టం సంభవిస్తుండటంతో అరబ్ దేశాలు భయంతో వణికిపోతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కలిసి ఇరాన్‌పై జరిగిన వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యారు. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగి, తన దాడులను మరింత తీవ్రతరం చేసింది. 
 
ఈ దాడుల్లో భాగంగా, తాజాగా సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని అమెరికా ఎంబసీపై విరుచుకుపడింది. దీంతో ఈ ప్రాంతంలో మంటలు చెలరేగగా.. దట్టమైన పొగ అలముకుంది. రెండు డ్రోన్లతో యూఎస్‌ ఎంబసీపై దాడి జరిగిందని సౌదీ రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ క్రమంలో మంటలు వ్యాపించినట్లు వెల్లడించింది. దీంతో భవనానికి స్వల్పంగా నష్టం వాటిల్లినట్లు తెలిపింది. దాడి సమయంలో కార్యాలయం ఖాళీగా ఉందని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది.
 
తాజా దాడి నేపథ్యంలో జెడ్డా, దహ్రాన్‌, రియాద్‌లోని అమెరికన్‌లు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సౌదీ అరేబియాలోని యూఎస్‌ రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలోనే రియాద్‌లో మరోసారి పేలుళ్లు వినిపించాయి. ఇక, సోమవారం కువైట్‌లోని అమెరికా ఎంబసీపై ఇరాన్‌ దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. 
 
తాజా దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌ పేరు ప్రస్తావించకుండా హెచ్చరికలు చేశారు. 'రియాద్‌లోని తమ ఎంబసీపై జరిగిన దాడి.. అమెరికన్‌ సైనికుల హత్యకు ప్రతిస్పందన ఎలా ఉంటుందో వారు త్వరలోనే తెలుసుకుంటారు' అని అన్నారు.