బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : సోమవారం, 30 మే 2016 (09:42 IST)

షేవ్ చేసుకున్నా.. బిగుతు దుస్తులు ధరించినా ఫైన్ కట్టాల్సిందే..

ఈ ఆధునిక కాలంలో యువకులు గడ్డాలు పెంచుకోవడం ఫ్యాషన్‌గా మారిపోయింది. కొందరు గడ్డం వైపు మొగ్గుచూపితే మరికొందరు మాత్రం ఇందుకు భిన్నంగా క్లీన్ షేవ్‌ చేసుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నారు.. అని అనుకుంటున్నారా... ఇక మీదట గడ్డం గీసుకున్నా... ట్రిమ్‌ చేసుకున్నా.. ఫైన్ కట్టాల్సిందే. అంతేకాదు సిగరెట్‌ ప్యాకెట్‌ ఉన్నా.. బిగుతు దుస్తులు ధరించినా.. కళ్లు కన్పించేలా దుస్తులు వేసుకున్నా... అన్నింటికీ ఫైన్‌ కట్టాల్సిందే. ఇదంతా మనదేశంలో అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆధిపత్యం ఉన్న ప్రాంతాల్లో మాత్రమే. 
 
గత కొంతకాలంగా ఉగ్రవాదుల సంస్థ తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులలో పడిన సంగతి తెలిసిందే. దీనికోసం చమురు, చేపల వ్యాపారం, కోళ్ల వ్యాపారం చేసినా ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కలేక పోతున్నారు. దీంతో తమను తాము బలపరుచుకునేందుకు ఐఎస్‌ ఆధీనంలో ఉన్న ప్రజలపై విధిస్తున్న పన్నులను ఒకేసారి పెంచేశారట. అంతేగాక కొత్త జరిమానాలను విధించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో వివిధ రూపాల్లో పన్ను వేసి అమాయకుల నుంచి భారీ మొత్తం సొమ్మును వసూలు చేయాలని నిర్ణయించుకుంది. ఇస్లామిక్‌ స్టేట్‌ విధించిన నూతన నిబంధనలను పరిశీలిస్తే...
 
గడ్డం గీసుకుంటే 100 డాలర్లు, ట్రిమ్‌ చేసుకుంటే 50 డాలర్లు, పురుషులు సంప్రదాయ దుస్తులు వేసుకోకుంటే 5 డాలర్లు, పురుషుల దగ్గర సిగరెట్‌ ప్యాకెట్‌ ఉంటే 46 డాలర్లు, మహిళ వద్ద ఉంటే 23 డాలర్లు, మహిళలు బిగుతు బురఖాలు వేసుకుంటే 25 డాలర్లు, కళ్లు కన్పించేలా దుస్తులు వేసుకుంటే 10 డాలర్లు లేదా 1 గ్రాము బంగారం, చెక్‌పాయింట్లను దాటి ట్రక్కులు వస్తే.. 600 నుంచి 700 డాలర్ల జరిమానా విధించనున్నారు.