శనివారం, 14 ఫిబ్రవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

మా బలగాల్లో సత్తా లేదు... బలూచిస్తాన్ వేర్పాటువాదుల చేతిలో ఓడిపోయాం.. పాకిస్తాన్

Khawaja Asif
పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇపుడు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పాకిస్తాన్ బలగాలు మానసికంగా అలసిపోయాయని, మానసిక వైఫల్యంతో బాధపడుతున్నాయని, ఫలితంగా బలగాల్లో సత్తా తగ్గిపోయిందని అన్నారు. ఈ కారణంగానే బలూచిస్తాన్ వేర్పాటువాదులను సమర్థవంతంగా అడ్డుకోలేకపోయామని చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, బలూచిస్థాన్ విస్తీర్ణం పాకిస్థాన్ మొత్తం భూభాగంలో 40 శాతానికి పైగా ఉందని, కానీ జనాభా మాత్రం చాలా తక్కువని ఆసిఫ్ పేర్కొన్నారు. 'ఒక నగరాన్ని నియంత్రించడం సులభం, కానీ ఇంత పెద్ద రాష్ట్రాన్ని కాపాడటం చాలా కష్టం. మా సైనికులు అక్కడ విధులు నిర్వహిస్తున్నారు, కానీ ఆ ప్రాంత విస్తీర్ణం, పర్వత ప్రాంతాల వల్ల వారు తిరుగుబాటుదారులను సమర్థవంతంగా అడ్డుకోలేకపోతున్నారు' అని ఆయన ఒప్పుకున్నారు.
 
జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 మధ్య 'ఆపరేషన్ హెరోఫ్ 2.0' పేరుతో బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల) విరుచుకుపడింది. ఈ దాడుల్లో దాదాపు 17 మంది భద్రతా సిబ్బంది, 33 మంది సామాన్య పౌరులు మరణించగా, పాక్ సైన్యం జరిపిన ఎదురుకాల్పుల్లో 177 మంది తిరుగుబాటుదారులు హతమైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈసారి దాడుల్లో మహిళా ఫైటర్లు కూడా పాల్గొనడం పాక్ సైన్యాన్ని కలవరపెడుతోంది. 
 
బలూచిస్తాన్‌లో కేవలం స్వేచ్ఛ కోసం పోరాటం జరగడం లేదని, అక్కడ చమురు స్మగ్లింగ్ చేసే మాఫియా, బ్యూరోక్రసీ, వేర్పాటువాదులు కలిశారని ఆసిఫ్ ఆరోపించారు. ఇరాన్ నుంచి జరిగే పెట్రోల్ స్మగ్లింగ్ ద్వారా వీరు రోజుకు సుమారు 4 బిలియన్ పాక్ రూపాయలు ఆర్జిస్తున్నారని, అందుకే వీరు అఫ్ఘనిస్థాన్ మద్దతుతో అల్లర్లు సృష్టిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.