సోమవారం, 9 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 మార్చి 2026 (19:09 IST)

టెహ్రాన్‌పై బాంబుల వర్షం - సురక్షిత ప్రాంతాలకు భారతీయ విద్యార్థుల తరలింపు

Iran
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్ మంగళవారం బాంబుల వర్షం కురిపించింది. దీంతో భారీ ప్రాణనష్టంగాతో పాటు ఆస్తి నష్టం వాటిల్లింది. టెహ్రాన్‌లో ఆందోళనకర పరిస్థితులు నెలకొనివున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అక్కడున్న భారతీయ విద్యార్థుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని స్థానిక రాయబార కార్యాలయం కీలక చర్యలు తీసుకుంది. అనేక మంది విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
 
'టెహ్రాన్‌పై దాడులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నగరంలోని అనేక మంది భారతీయ విద్యార్థులను సురక్షిత ప్రదేశాలకు తరలించాం. విద్యార్థుల రవాణా, ఆహారం, వసతి ఏర్పాట్లను చూసుకున్నాం. ఎంబసీ సాయాన్ని నిరాకరించిన కొంతమంది మాత్రమే ప్రస్తుతం టెహ్రాన్‌లో ఉన్నారు. ఇంకా ఇరాన్‌లోనే ఉన్న భారతీయ విద్యార్థులు, పౌరులు.. ఇదివరకే జారీ చేసిన సలహాలు పాటించాలి. ప్రస్తుతం ఉన్న ప్రాంతంలోనే ఇళ్లకే పరిమితం కావాలి. వీలైనంత వరకు కిటికీలకు దూరంగా ఉండండి. ఎల్లవేళలా అప్రమత్తంగా వ్యవహరించండి. నిరసనలు, ప్రదర్శనలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లొద్దు. భారత రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండండి' అని టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. 
 
ఇరాన్ అధ్యక్ష భవన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం 
 
ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని అత్యంత పటిష్టమైన భద్రత ఉండే నాయకత్వ సముదాయంపై ఇజ్రాయెల్ రక్షణ దాళాలు (ఐడీఎఫ్) విరుచుకుపడ్డాయి. ఈ భారీ వైమానిక దాడుల్లో ఇరాన్ అధ్యక్ష భవనం, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ భవనాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో ఇప్పటివరకు 787 మంది మృత్యువాతపడినట్టు సమాచారం. 
 
ఖచ్చితమైన సమాచారంతో సుమారు 100 ఫైటల్ జైట్లను ఉపయోగించి 250కి పైగా బాంబులను జారవిడిచనట్టు ఐడీఎఫ్ ప్రకటించింది. ఇరాన్ రాజకీయ, సైనిక నిర్ణయాలు తీసుకునే కీలక కేంద్రంగా ఈ సముదాయం ఉంది. ఇరాన్ అణు కార్యక్రమాలు, ఇజ్రాయెల్‌పై వ్యూహాలను ఇక్కడ రచిస్తారని, అందుక ఇరాన్ కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడులు చేశామని ఇజ్రాయెల్ తెలిపింది. ఇక్కడ నుంచే ఇరాన్ సైనిక, భద్రతా వ్యవహరాలన్నీ నడుస్తాయని, ఇది ఉగ్రవాద పాలనకు ప్రధాన కార్యాలయంగా మారిందని ఐడీఎఫ్ పేర్కొంది. 
 
గత ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ప్రారంభించిన ఈ దాడుల్లో ఇప్పటిక ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా దాడులు ముమ్మరం చేసింది. తాజాగా సౌదీ అరేబియా, కువైట్‌లోని అమెరికా ఎంబసీలపై ఇరాన్ డ్రోన్ దాడులు చేయడంతో అక్కడ పాక్షికంగా ఆస్తి నష్టం వాటిల్లింది. అటు ఇరాన్‌లోని నతాంజ్ అణు కేంద్రం కూడా దెబ్బతిన్నట్టు ఐఏఈఐ నిర్ధారించింది.