బుర్ర లేని దేశంగా మారుతున్న పాకిస్తాన్, పారిపోతున్న వైద్యులు, ఇంజినీర్లు- అసిమ్ కారణమట
పాకిస్తాన్ దేశం నుంచి వైద్యులు, ఇంజినీర్లు, ఎకౌంటెంట్లు తదితర కీలక ఉద్యోగాలు చేసేవారు వలస వెళ్లిపోతున్నారు. అక్కడ ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారిపోతుండటం, ఇంకోవైపు సైనిక పెత్తనం అధికం కావడం, ప్రతి విషయంలోనూ ఆర్మీ చీఫ్ అసిమ్ జోక్యం చేసుకోవడంతో ఇక అక్కడ లాభం లేదని మేధావులు తిన్నగా వలసపోతున్నారట.
గత రెండేళ్లలో పాకిస్తాన్ దేశం నుంచి 5 వేల మంది వైద్యులు, 11 వేల మంది ఇంజినీర్లు, 13 వేల మంది అకౌంటెంట్లు విదేశాలకు వలస వెళ్లిపోయినట్లు ప్రభుత్వ నివేదికలో బైటపడింది. ఇలా ఎందుకు జరుగుతోందంటూ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అక్కడి ప్రజలే నిలదీస్తున్నారు. ఆసిమ్ మునీర్ అవలంభిస్తున్న వైఖరి కారణంగా విదేశాలకు వెళ్లిపోవడం ఉత్తమం అనే భావనకు చాలామంది వస్తున్నారని చెబుతున్నారు.
పాకిస్తాన్ దేశంలో ఇంటర్నెట్ షట్ డౌన్ కారణంగా ఏకంగా 23 లక్షల ఫ్రీలాన్సింగ్ ఉద్యోగాలు ప్రమాదంలో పడినట్లు సమాచారం. వైద్యులతో పాటు కీలక రంగాలకు చెందినవారు వెళ్లిపోతుండటంతో పాక్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. దేశం నుంచి వలస వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వారిని కట్టడి చేస్తోంది. ఐతే వలసలకు అడ్డుకట్ట వేయకపోతే కొన్నాళ్లకు పాకిస్తాన్ దేశం మేధావులు లేని... అంటే బుర్ర లేని దేశంగా మారిపోతోంది.