సోమవారం, 9 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 మార్చి 2026 (10:14 IST)

హలో నెతన్యాహు జీ... మా పౌరులను భద్రంగా చూసుకోండి : ప్రధాని మోడీ

PM Modi
అమెరికా - ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాలు ప్రత్యక్ష యుద్ధానికి తలపడ్డాయి. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ పరిస్థితులపై కేంద్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుత పరిస్థితులపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి మాట్లాడారు. 
 
ఈ యుద్ధ సమయంలో దేశ పౌరుల భద్రకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అలాగే, ఘర్షణలను సాధ్యమైనంత త్వరగా ముగించాల్సిన అవసరాన్ని ఆయన పునరుద్ఘాటించారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ తన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. 
 
అలాగే, అమెరికా - ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌‌పైకి కూడా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. దాంతో ఆ దేశంలో పలువురు భారతీయులు చిక్కుకుపోయారు. 
 
ఈ నేపథ్యంలో యూఈఏ అధ్యక్షుడు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌తో మోడీ ఫోనులో మాట్లాడారు. ఇరాన్ దాడుల్ని ఖండించారు. యూఏఈకి అండగా ఉంటామని సంఘీభావం ప్రకటించారు. అలాగే తమ పౌరులను జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు షేక్‌ మహమ్మద్‌కు కృతజ్ఞత తెలిపారు.
 
మరోవైపు, ఆదివారం రాత్రి భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ భేటీకి మోడీ అధ్యక్షత వహించారు. దేశ భద్రత, వ్యూహాత్మక అంశాలపై నిర్ణయం తీసుకునే అత్యున్నత కమిటీ ఇది. పశ్చిమాసియాలో ఘర్షణల వల్ల తలెత్తిన పరిణామాలపై ఆ సందర్భంగా చర్చించారు.