1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 3 జూన్ 2016 (15:57 IST)

పెంపుడు జంతువుగా మారిన ఎలుగుబంటి.. దత్తత తీసుకున్న దంపతులు ఎక్కడ? (ఫోటోలు)

సాధారణంగా ప్రతిఒక్కరు తమ ఇళ్లలో ఏదో ఒక జంతువును పెంపుడు జంతువుగా పెంచుకుంటుంటారు. మరికొంతమంది చిన్నచిన్న పిల్లులను, కుక్కలను, కుందేళ్లను, తీసుకువచ్చి తమపిల్లలకు బహుమానంగా ఇస్తుంటారు. గతంలో డబ్బులున్నవారే పెంపుడు జంతువులను పెట్టుకునేవారు. కానీ ప్రస్తుతకాలంలో చిన్నా-పెద్ద, పేద-ధనిక వంటి తేడాలు లేకుండా అందరూ ఏదో ఒక జంతువును పెంచుకోవడం అలవాటుగా మారిపోయింది. 
 
కానీ ఇక్కడ ఒక కుటుంబం మాత్రం భారీ జంతువునే పెంపుడు జంతువుగా పెంచుకుంటోంది. అది కూడా సాధు జంతువు కాదు.. మనుషులను వేటాడే జంతువు. ఇంతకి ఆ జంతువు ఏంటో తెలుసా.... ఓ ఎలుగుబంటి. ఆ ఎలుగుబంటి పేరు స్టీఫెన్. అది చిన్నగా ఉన్నప్పుడే తల్లికి దూరమై అనాధగా మిగిలిపోయింది. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఎలుగుబంటిని రష్యాలోని మాస్కోకు చెందిన యూరీ పాంటలీన్‌కో జంట దత్తత తీసుకున్నారు. అలా మూడు నెలల పిల్లగా ఉన్నప్పుడు దానిని ఇంటికి తీసుకొచ్చారు. 
 
క్రూరమైన గోళ్లతో జంతువులను వేటాడి కడుపు నింపుకోవాల్సిన అడవి జంతువు ఆ ఇంట్లో సాధుజంతువుగా చలామణి అవుతోంది. ఆ కుటుంబంలో అది కూడా ఒక మనిషిగా మారిపోయింది. వారితో కలసి ఆడుకుంటుంది. ఆకలేస్తే డైనింగ్‌ టేబుల్‌ మీద కూర్చుని విందారగిస్తుంది... సోఫాలో కూర్చుని టీవీ చూస్తుంది.. బోరుకొడితే కూల్‌ డ్రింక్‌లూ గటగటా తాగేస్తుంది. నిద్రొస్తే వారితోనే కలసి బెడ్ మీద పడుకుంటుంది. 
 
ఆ ఎలుగుబంటి మీదో ఆ జంట ఎనలేని ప్రేమను పెంచుకున్నారు. దానిని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితి వారికి ఏర్పడింది. వారి నిత్య జీవితంలో స్టీఫెన్‌ అంతగా కలిసి పోయిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవలే దానితో కలిసి వారు ఓ ఫొటో షూట్‌ కూడా తీయించుకున్నారు. భలేగా ఉంది కదూ... ఆ ఫోటోల్ని ఓ లుక్కేద్దామా..!