హార్ముజ్ జలసంధిని మూసేశాం.. దాటేందుకు వచ్చే నౌకలకు నిప్పుపెడతాం : ఇరాన్ భీకర వార్నింగ్
ముడి చమురు రవాణాకు అత్యంత కీలకమైన జలమార్గమైన హార్ముజ్ జల సంధిని ఇరాన్ మూసివేసింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూనే, ఇపుడు ఒక్క నౌక వచ్చినా వదిలిపెట్టబోమని బీకర హెచ్చరిక చేసింది. అమెరికా - ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా ఇరాన్‌పై వైమానిక దాడులకు దిగిన విషయం తెల్సిందే. దీంతో పశ్చిమాసియాలో యుద్ధవాతావరణం నెలకొంది. ఇది నానాటికీ తీవ్రరూపం దాల్చుతోంది.
ఈ ఘర్షణల కారణంగా ఇప్పటికే ముడిచమురు ధరలు పెరుగుతుండగా ఇరాన్ ఇచ్చిన వార్నింగ్ మరింత ఆందోళనకు దారితీస్తోంది. హార్ముజ్ జలసంధిని మూసివేశామని, నౌకలు దానిని దాటడానికి ప్రయత్నిస్తే నిప్పు పెడతామని హెచ్చరించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్, నౌకాదళ సిబ్బంది ఆ పని చేస్తారని ఇరాన్ హెచ్చరించింది.
హర్ముజ్.. ప్రపంచ ఇంధనానికి జీవనాడి వంటిది. కేవలం కొన్ని కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ ప్రదేశం నుంచి ప్రపంచం వాడే చమురులో ఐదోవంతు రవాణా అవుతోంది. ఈ జలసంధిలో ఏర్పడే ఏ అంతరాయం అయినా ప్రపంచ వాణిజ్యాన్ని గజగజలాడిస్తుంది. ఈ మార్గం నుంచి వచ్చే చమురు, ఎల్‌ఎన్‌జీ అత్యధికంగా భారత్, చైనా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలకు ఎగుమతి అవుతోంది.
ఇంతటి కీలకమైన జలసంధి మూసుకుపోతే.. రవాణా, బీమా ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. ఇప్పటికే ఆ ప్రభావం కనిపిస్తోంది. చమురు ధరలు భగ్గుమంటున్నాయి. కాగా.. అమెరికా - ఇజ్రాయెల్ దాడుల్లో తమ సుప్రీంనేత ఖమేనీ మృతి చెందడంతో ఇరాన్ రగిలిపోతోంది. ఈ నేపథ్యంలోనే హర్ముజ్‌ను మూసివేసినట్లు ప్రకటించింది.