ఇంధన కొరత - ధరల పెరుగుదల... విమాన సర్వీసులు నిలిపివేసిన స్పిరిట్ ఎయిర్‌లైన్
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడింది. దీంతో జెట్ ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ కారణంగా విమానయాన సంస్థలు తీవ్రమైన ఇంధన, ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ జెట్ ఇంధన ధరల కారణంగా కొన్ని విమానయాన సంస్థలు తమ సర్వీసులను తగ్గించుకుంటుండగా.. మరికొన్ని టికెట్ల రేట్లు పెంచుతున్నాయి.
ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన చెందిన విమానయాన సంస్థ స్పిరిట్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ సర్వీసులను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని తక్షణమే అమలుచేయనున్నట్లు వెల్లడించింది. అన్ని విమాన సర్వీసులను రద్దు చేశామని.. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు డబ్బు తిరిగి చెల్లిస్తామని తెలిపింది. అయితే ఇతర విమానయాన సంస్థల్లో ప్రయాణ బుకింగ్‌లకు ఎలాంటి సాయం చేయబోమని స్పష్టం చేసింది.
గత 34 ఏళ్లుగా స్పిరిట్ ఎయిర్ లైన్స్ తక్కువ ఛార్జీలతో ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందిస్తోంది. రోజూ వందలాది సర్వీసులను నడుపుతూ సుమారు 17,000 మందికి ఉపాధి కల్పించింది. కొవిడ్ తర్వాత పెరిగిన నిర్వహణ ఖర్చుల వల్ల ఈ ఎయిర్‌లైన్స్ పలు ఆర్థిక సమస్యలు, అప్పులతో ఇబ్బందులు పడుతోంది. ఇరాన్ యుద్ధం వల్ల జెట్ ఇంధన ధరలు ఆకాశాన్నంటడంతో.. ప్రస్తుతం ఈ విమానయాన సంస్థ దివాలా తీసే పరిస్థితికి వచ్చింది.
