బుధవారం, 18 ఫిబ్రవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 13 జనవరి 2026 (17:42 IST)

ప్రపంచ దేశాలతో ట్రంప్ గిల్లికజ్జాలు, గ్రీన్‌ల్యాండ్‌ను కబ్జా చేసేందుకు మాస్టర్ ప్లాన్

Trump, NATO countries
అమెరికా పీఠాన్ని అధిష్టించిన దగ్గర్నుంచి డొనాల్డ్ ట్రంప్ ఉన్నచోట వుండటంలేదు. ఏదో ఒకటి కెలుకుతూనే వున్నారు. కాసేపు వీసా నిబంధనలు అంటారు. ఇంకాసేపు ఎన్నారైలను తరిమేస్తానంటారు. అంతలోపుగానే టారిఫ్‌లు పెంచేస్తూ నిర్ణయాలు తీసుకుంటారు. ఈలోపుగానే వెనిజులాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని చెరబట్టేస్తారు.
 
ఇదేంటి ట్రంప్ ఇలా చేస్తున్నారు అనుకునేలోపుగానే గ్రీన్ లాండ్ గురించి మరో 20 రోజుల తర్వాత మాట్లాడుకుందాం అంటూ ప్రపంచానికి షాకిస్తారు. ఇవన్నీ చూస్తుంటే ఏదోరకంగా చాలామటుకు ప్రపంచ దేశాలతో ట్రంప్ గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నట్లు అర్థమవుతోంది. దీనితో చాలామంది ముదిమిచే మతి తప్పిందా అన్న సామెత చందంగా ట్రంప్‌కి తెలివి ఎక్కువై ఇలా చేస్తున్నారా లేక తెలివి తక్కువై అలా ప్రవర్తిస్తున్నారా అంటూ పలు దేశాలు మండిపడుతున్నాయి.
 
గ్రీన్ లాండ్ గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై డెన్మార్క్ కుతకుతలాడుతోంది. పుండు మీద కారం చల్లినట్లు తాజాగా గ్రీన్ లాండ్ ను చేజిక్కించుకునేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఓ సంఘటనను బట్టి తెలుస్తోంది. రిపబ్లికన్ పార్టీకి చెందిన రాండి అనే సభ్యుడు గ్రీన్ లాండ్ అనక్సీయేషన్ అండ్ స్టేట్ హుడ్ యాక్ట్ అనే పేరుతో అమెరికా సభలో బిల్లు ప్రవేశపెట్టాడు. ఆ బిల్లును ఆమోదిస్తే గ్రీన్ లాండ్ ను అమెరికా కైవసం చేసుకోవడం ఇక ఎంతోసేపు పట్టదు. 
 
గ్రీన్ లాండ్‌ను అమెరికాకు చెందిన రాష్ట్రంగా ప్రకటించేస్తారు. ఇందుకోసేమే దొడ్డిదోవ నుంచి ట్రంప్ ఈ పని చేసి వుంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఇప్పటికే గ్రీన్ ల్యాండ్ గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై డెన్మార్క్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కానీ అవేవీ పట్టించుకునే దశలో ట్రంప్ లేరు. సాధ్యమైనంత త్వరగా గ్రీన్ ల్యాండ్ దీవిని కబ్జా చేసేందుకు పూర్తి సన్నాహాలు చేసుకుంటున్నారు.