సోమవారం, 9 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 3 మార్చి 2026 (12:52 IST)

ఇరాన్ ప్రతిదాడులు చూసి ట్రంప్ బుర్ర వేడెక్కిపోతుందా? యుద్ధం ఎప్పుడు ఆగుతుంది?

Trump on Iran
కేవలం 2 రోజుల్లో ఇరాన్ ఆట కట్టిస్తాం అని చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇరాన్ ఎదురుదాడులు చూసి ఆయన బుర్ర వేడెక్కిపోతుందంటున్నారు. ఒకవైపు ఇరాన్ విచక్షణారహితంగా అమెరికా మిత్రదేశాలపైన బాంబుల వర్షం కురిపిస్తోంది. దీనివల్ల దుబాయ్, ఖతార్, యుఏఇ తదితర దేశాలకు భారీగా నష్టం వాటిల్లుతోంది. దీనిపై ఆయా దేశాలు ట్రంప్ వ్యవహారంపై ఒకింత అసంతృప్తిగా వున్నాయి.
 
ఉక్రెయిన్ వంటి చిన్న దేశాన్ని లొంగదీసుకునేందుకే రష్యా నాలుగేళ్లుగా పోరాడుతోంది. దాడులు జరుపుతున్నా ఉక్రెయిన్ ఎంతమాత్రం దారిలోకి రావడంలేదు. దీనితో రష్యా ఆర్థికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. అట్లాంటి పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు ఇరాన్ పైన దాడి చేయడం తెలివైన పనికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
ఎందుకంటే ఇరాన్ చేతిలో 11 అణుబాంబులు తయారుచేసేందుకు శుద్ధి చేయబడి యురేనియం వున్నదని అమెరికా అధికారులే చెబుతున్నారు. కనుక ఇరాన్ పైన అమెరికా-ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం ఎప్పటికి ముగుస్తుందో చెప్పలేని పరిస్థితి వుందని అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు యుద్ధం మరో నాలుగైదు వారాలు పట్టవచ్చని అంటున్నారు. ఐతే అది అనుకున్నంత సులభం కాదని గత అనుభవాలు చెబుతున్నాయి. ఈ యుద్ధం రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలా సంవత్సరాలు పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు.
 
హర్ముజ్ జలసంధిని మూసేసిన ఇరాన్, చమురు చిక్కుల్లో భారత్?
తమపై ఎలాంటి దాడులు జరిగినా ఇరాన్ చేసే మొట్టమొదటి పని హర్ముజ్ జలసంధిని మూసివేయడం. ఎందుకంటే ఈ జలసంధి ద్వారానే ప్రపంచానికి అవసరమైన చమురులో 20 శాతం మేర నౌకల ద్వారా సరఫరా అవుతుంది. మరీముఖ్యంగా భారతదేశానికి అత్యధికంగా ఈ మార్గం ద్వారానే గల్ఫ్ దేశాల నుంచి చమురు, ఎల్ఎన్జి సరఫరా అవుతుంటాయి. అట్లాంటి ప్రధానమైన రవాణా మార్గాన్ని ఇరాన్ మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
 
ఆ మార్గం ద్వారా ఏవైనా నౌకలు వెళ్లే ప్రయత్నం చేస్తే తమ నౌకాదళ సిబ్బంది, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ వాటికి నిప్పు పెడతారని వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ తాజా ప్రకటనతో భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా తీవ్ర ఇక్కట్లను ఎదుర్కోవలసిన పరిస్థితులు తలెత్తనున్నాయి. ఐతే చైనా, జపాన్, దక్షిణ కొరియా తమతమ దేశాల్లో ఇప్పటికే భారీగా చమురును నిల్వ చేసుకున్నట్లు చెబుతున్నారు.
 
ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేసినప్పటికీ జపాన్ వద్ద కనీసం ఏడాదికి సరిపడా నిల్వలున్నట్లు సమాచారం. అలాగే చైనా కూడా భారీగా నిల్వ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఉత్తర కొరియా వద్ద 200 రోజులకు పైగా సరిపడా చమురు నిల్వలు వున్నట్లు సమాచారం. మన దేశం పరిస్థితి చూస్తే.. ఇంధన మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం మన దేశంలో 74 రోజులు వరకూ ఎలాంటి ఇబ్బంది వుండదని చెబుతున్నారు. మరి ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఎన్నాళ్లకు ముగుస్తుందో చూడాల్సి వుంది. ఇదిలావుంటే భారతదేశం తన చమురు అవసరాలకు ఏమేమి చేయాలన్నదానిపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు భోగట్టా.