1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. US Energy Secretary Chris Wright has said oil prices could reach their highest point in the few weeks

ఇపుడే ఏం కాలేదు.. ముందుంది మొసళ్ళ పండుగ : అమెరికా మంత్రి

crude oil
అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొనివున్నాయి. ముఖ్యంగా చమురు సంక్షోభం తలెత్తింది. దీంతో రానున్న వారాల్లో చమురు ధరలు గరిష్టస్థాయికి చేరే అవకాశాలు ఉందని అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్ హెచ్చరించారు. హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలు మొదలైనప్పటికీ రావాణా మునుపటి స్థాయికి చేరుకునేంత వరకు ఇంధన ధరల మోత ఉంటుందని హెచ్చరించారు. 
 
ఇదే అంశంపై ఆయన వాషింగ్టన్‌లో మాట్లాడుతూ, 'హర్మూజ్‌‌లో నౌకల రాకపోకలు గణనీయస్థాయిలో పెరిగే వరకు ఇంధన ధరల అధికంగా ఉండొచ్చు. పెరుగుతూనే ఉండొచ్చు కూడా' అని వ్యాఖ్యానించారు. చమురు ధరలు తగ్గొచ్చని కొద్దిరోజుల క్రితం ఆయనే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక నవంబరు నెలలో జరుగనున్న మిడ్‌టర్మ్ ఎన్నికల వరకు ఇంధన ధరలు ఎక్కువగానే ఉండొచ్చని ఇటీవల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా సూచనప్రాయంగా వెల్లడించారు.
 
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో మార్చి నెలలో గల్ఫ్ దేశాల నుంచి చమురు ఉత్పత్తి భారీగా తగ్గిందని ఒపెక్ విడుదల చేసిన డేటా ప్రకారం వెల్లడవుతోంది. ఇరాక్‌లో దాదాపు 61శాతం మేర ఉత్పత్తి తగ్గింది. ఫిబ్రవరిలో రోజుకు 4.2 మిలియన్‌ బ్యారెళ్ల నుంచి మార్చిలో రోజుకు 1.6 మిలియన్‌ బ్యారెళ్లకు పడిపోయింది. 
 
కువైట్‌లో 53శాతం, యూఏఈలో 44 శాతం, సౌదీ అరేబియా 23 శాతం ఉత్పత్తి తగ్గిపోయింది. ఇక చమురు సరఫరాలో కీలకమైన పైప్‌లైన్ ఇరాన్ దాడుల్లో దెబ్బతినడంతో రోజూవారీ 7 మిలియన్ల బ్యారెళ్ల నుంచి 7 లక్షల బ్యారెళ్లకు పడిపోయిందని సౌదీ మీడియా వెల్లడించింది. మొత్తంగా ఒపెక్ దేశాలు చేసే ఉత్పత్తి 27 శాతం మేర కుంగింది.
 
ఇదిలాఉంటే.. హర్మూజ్‌ జలసంధిని దిగ్బంధించాలన్న అగ్రరాజ్యం నిర్ణయాన్ని చైనా తీవ్రంగా తప్పుబట్టింది. జలసంధిలో తమ నౌకల కార్యకలాపాలు కొనసాగుతున్నాయని వెల్లడించింది. అందుకు తగ్గట్టే ట్రంప్ హెచ్చరికలను పట్టించుకోకుండా.. అమెరికా ఆంక్షలున్న చైనా ట్యాంకర్ హర్మూజ్‌ను దాటింది. మరిప్పుడు దీనిపై యూఎస్ నౌకాదళం ఎలా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది. 
About Writer
సెల్వీ
తర్వాతి కథనం
చెరువులో కాలేజీ కట్టిన ఓవైసీ... కూల్చే దమ్ములేక పారిపోయిన హైడ్రా అధికారులు