సోమవారం, 9 ఫిబ్రవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 ఫిబ్రవరి 2026 (11:40 IST)

నిద్రపోతున్నట్టు నటిస్తూ.. తోటి ప్రయాణికురాలికి లైంగిక వేధింపులు.. దోషిగా తేల్చిన యూఎస్ కోర్టు

woman victim
విమానంలో ప్రయాణిస్తున్న ఓ భారతీయ ప్రయాణికులు నిద్రపోతున్నట్టు నటిస్తూ తోటి ప్రయాణికురాలిపై అసభ్యంగా ప్రవర్తించిన కేసులో అమెరికా కోర్టు ఆ ప్రయాణికుడుని దోషిగా తేల్చింది. తాజాగా వెల్లడైన వివరాల మేరకు.. వరుణ్‌ అరోరా (38) అనే వ్యక్తి అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నాడు. 2024 ఆగస్టులో రోడ్‌ ఐలాండ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రోనాల్డ్‌ రీగన్‌ వాషింగ్టన్‌ విమానాశ్రయానికి వెళ్లాడు. 
 
ఆ సమయంలో విమానంలో నిద్రపోతున్నట్టు నటిస్తూ.. తోటి ప్రయాణికురాలితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ క్రమంలో బాధితురాలు పలుమార్లు హెచ్చరించినా వేధింపులు కొనసాగించాడు. విమానం గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత బాధితురాలు ఆ వ్యక్తి ఫొటో తీసి.. విమానయాన సంస్థకు ఫిర్యాదు చేశారు. 
 
దీనిపై ఎఫ్‌బీఐ అధికారులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని గత యేడాది ఆగస్టులో అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి నేరం నిర్ధరణ కావడంతో ఫెడరల్‌ జిల్లా కోర్టు న్యాయమూర్తి త్వరలోనే శిక్ష ఖరారు చేయనున్నారు. ఈ కేసులో అతడికి రెండేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.