సోమవారం, 9 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 మార్చి 2026 (12:58 IST)

అమెరికా యుద్ధ విమానాలను కూల్చివేసిన కువైట్ జెట్లు

war
అమెరికా - ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య యుద్ధం మరింత తీవ్రతరమవుతోంది. ఈ కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన మూడు ఎఫ్‌-15ఈ స్ట్రైక్‌ ఈగిల్‌ యుద్ధ విమానాలు ఇటీవల కువైట్‌‌లో నేలకూలిన సంగతి తెలిసిందే. 
 
కువైట్‌కు చెందిన ఎఫ్‌/ఏ- 18 హార్నెట్‌ (F/A-18 హార్నెట్) ఫైటర్‌జెట్‌ వీటిని కూల్చివేసిందని తాజాగా వెల్లడైనట్లు తెలుస్తోంది. పొరపాటున ఈ ఘటన చోటుచేసుకుందని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ తన కథనంలో పేర్కొంది. 
 
అమెరికా - ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య యుద్ధం ప్రారంభమైన మూడో రోజునే ఈ ఘటన జరిగింది. వాల్‌స్ట్రీట్‌ కథనం ప్రకారం.. ఎఫ్‌/ఏ- 18 హార్నెట్‌ పైలట్‌ పొరపాటున యూఎస్‌ ఫైటర్‌జెట్‌ల వైపు మూడు క్షిపణలను ప్రయోగించారని ఓ యూఎస్‌ అధికారి పేర్కొన్నారు. దీంతో అవి కువైట్‌లో కూలిపోయాయన్నారు. ఈ ప్రమాదం నుంచి ముగ్గురు పైలట్లు, ఇతర సిబ్బంది సురక్షితంగా బయటపడినట్లు వెల్లడించారు. 
 
యూఎస్ సెంట్రల్ కమాండ్ ఈ చర్యను ఫ్రెండ్లీ ఫైర్‌గా పేర్కొంది. ఈ ఘటనను అంగీకరించిన కువైట్‌ అధికారులు ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించారు. అమెరికా ఫైటర్‌జెట్‌లను కూల్చివేసేందుకు దారితీసిన పరిస్థితులపై ఇంకా స్పష్టత రాలేదు. యూఎస్ ఫైటర్ జెట్‌లు కూలిపోయిన దృశ్యాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. అందులో ఒకటి గిరగిరా తిరుగుతూ నేల కూలింది. ఈ క్రమంలో దాని వెనుక భాగం నుంచి మంటలు వెలువడ్డాయి.