శుక్రవారం, 6 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 జనవరి 2026 (16:34 IST)

అంధకారంలో వెనెజువెలా రాజధాని - మొబైల్ చార్జింగ్ కోసం బారులు

venezuela people
వెనెజువెలా రాజధాని కారకాస్‌లో అంధకారం నెలకొంది. వెనెజువెలా అధ్యక్షుడు మదురోను తమ దారికి తెచ్చుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా సైన్యం కారకాస్‌పై మెరుపుదాడులు జరిపింది. ఈ దాడులతో వెనుజువెలా వాసులు భయంతో వణికిపోయారు. ముఖ్యంగా, అమెరికా సేనలు జరిపిన దాడుల్లో కీలకమైన మౌలిక సదుపాయాలు, విద్యుత్ గ్రిడ్‌లు దెబ్బితిన్నాయి. దీంతో కారకాస్‌లో అంధకారం నెలకొంది. మొబైల్ చార్జింగ్ కోసం రాజధాని ప్రజలు గంటల తరబడి క్యూలైన్లలో నిల్చొంటున్నారు. అలాగే, సూపర్ మార్కెట్లు మూతపడటంతో చిన్న దుకాణాల వద్ద ప్రజలు ఆహారం వేచి చూడాల్సిన పరిస్థితి తలెత్తింది. 
 
అమెరికా మెరుపు దాడులతో కారకాస్‌లో భారీ నష్టం జరిగింది. కారకాస్‌లోని విమానాశ్రయంపై కూడా అమెరికా దాడి చేసింది. నగరానికి 100 కి.మీల దూరంలో ఓ వైమానిక స్థావరం ఉంది. దేశంలోనే అతిపెద్దది. అది కూడా దెబ్బతింది. ఫోర్ట్‌ట్యూనా మిలిటరీ స్థావరం వద్ద ఎక్కువ నష్టం జరిగింది. దాడి అనంతరం అన్ని సూపర్‌ మార్కెట్లు మూసేశారు. చిన్ని చిన్న దుకాణాలు మాత్రమే తెరిచి ఉన్నాయి. వాటి ముందు పొడవైన క్యూలు కన్పిస్తున్నాయి. ప్రతి చోటా 500 - 600 మంది బారులు తీరారు. ఫార్మసీలు వద్ద చాలా పెద్ద క్యూలు కన్పిస్తున్నాయి అని ఆ దేశ ప్రజలు పేర్కొన్నారు. 
 
ప్రజా రవాణా సేవలు కూడా నిలిచిపోయాయి. భయంతో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు కూడా రావడం లేదన్నారు.  కరెంటు లేకపోవడంతో ఫోన్ ఛార్జింగ్‌కు కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై ఉన్న కొన్ని విద్యుత్ దీపాల వద్ద కరెంటు ఉండటంతో.. దాని నుంచి ప్రజలు ఫోన్‌లకు ఛార్జింగ్‌ పెట్టుకుంటున్నారు. 
 
మరోవైపు, వెనెజువెలాలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశంలో నివసిస్తున్న భారతీయుల కోసం అక్కడి భారత రాయబార కార్యాలయం ఓ వాట్సప్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. దాని నుంచి ముఖ్యమైన సూచనలు చేస్తోంది.